TURKIYE: తుర్కియేపై భారత్ అనధికార యుద్ధం

భారత్-పాకిస్థాన్‌ల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు.. పాక్‌కు అండగా నిలిచిన తుర్కియేకు భారత్ సెగ తగులుతోంది. ఆ దేశంపై ప్రభావం పడేలా పలు నిర్ణయాలను మన సంస్థలు తీసుకుంటున్నాయి. భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సమయంలో పాకిస్థాన్ కు తుర్కియే డ్రోన్లు, ఆయుధాలతోపాటు సైనికులను పంపింది. దీంతో తుర్కియేపై భారత ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే ఆ దేశానికి చెందిన వస్తువులను భారతీయులు స్వచ్ఛందంగా నిషేధిస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట ‘బాయ్‌కాట్ తుర్కియే’ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. మరోవైపు తుర్కియేను దెబ్బ తీసేలా భారత్ కఠిన చర్యలు తీసుకుంటోంది.
తుర్కియేకు సీఐటీఏ షాక్..
తుర్కియే, అజర్‌బైజాన్‌తో ట్రావెల్, టూరిజం సహా అన్ని సంబంధాలను పూర్తిగా బాయ్‌కాట్ చేస్తున్నట్టు ఆల్ ఇండియా ట్రేడర్స్ కాన్ఫెడరేషన్ (సీఏఐటీ) నిర్వహించిన నేషనల్ ట్రేడ్ కాన్ఫరెన్స్‌లో 125కు పైగా టాప్ ట్రేడ్ లీడర్లు నిర్ణయించారు. తుర్కియేతో అన్నిరకాల వాణిజ్య, వర్తక సంబంధాలను బాయ్‌కాట్ చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. టర్కీ, అజర్‌బైజాన్‌లో సినిమాలు షూటింగ్ చేయవద్దని కూడా భారత చలనచిత్ర పరిశ్రమకు ట్రేడ్ కమ్యూనిటీ విజ్ఞప్తి చేసింది. అక్కడ సినిమాలు షూట్ చేస్తే ట్రేడ్ కమ్యూనిటీతోపాటు, ప్రజలంతా ఆ చిత్రాలను బాయ్‌కాట్ చేస్తారని హెచ్చరించింది. ఆ దేశాల్లో ఉత్పత్తి ప్రమేషన్‌లను ఏ కార్పొరేట్ సంస్థ షూట్ చేయరాదని సైతం సదస్సులో నిర్ణయించారు. సీఏఐటీ ట్రేడ్ కాన్ఫరెన్స్‌లో 24 రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంఘీభావం తెలిపారు. భారత్‌కు వ్యతిరేకంగా నిలిచే శక్తులను వ్యతిరేకించాలని ప్రతినబూనారు. భారతదేశం ఇటీవల తీవ్రమైన జాతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కొన్న సమయంలో పాక్‌కు తుర్కియే, అజర్‌బైజాన్ దేశాలు మద్దతు ప్రకటించాయి. ఈ దేశాలు సంక్షోభంలో పడినప్పుడు ముఖ్యంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం మానవతాసాయంతోపాటు దౌత్యపరంగా ఆదుకుందని, అయితే ఈ రెండు దేశాలు భారత్ పట్ల వంచనకు పాల్పడ్డాయని వాణిజ్య వర్గాలు విమర్శలు గుప్పించాయి.
లబోదిబోమంటున్న సెలెబీ
దేశంలోని పలు విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలు అందించే తుర్కియే సంస్థ సెలెబి ఏవియేషన్ సెక్యూరిటీ క్లియరెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయంపై సెలెబి సంస్థ తాజాగా స్పందించింది. తమది తుర్కియేకి చెందిన సంస్థ కాదని స్పష్టం చేసింది. అంతేకాదు, ఆ దేశాధ్యక్షుడు ఎర్డోగాన్ కుటుంబంతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఆయన కుమార్తె తమకు బాస్ కాదని వివరణ ఇచ్చింది. సెలెబి సంస్థను ఎర్డోగాన్ కుమార్తె సుమేయే నియంత్రిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తెలిపింది. తమ మాతృ సంస్థలో సుమేయే పేరుతో ఎవరికీ వాటాలు గానీ, యాజమాన్య హక్కులు గానీ లేవని స్పష్టం చేసింది. కంపెనీ యాజమాన్యం హక్కులన్నీ సెలెబియోగ్లు కుటుంబ సభ్యులైన కెన్ సెలెబియోగ్లు, కెనన్ సెలెబియోగ్లులకు మాత్రమే పరిమితం అని వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com