Vietnam Hanoi: కేఫ్‌లో గొడవ.. 11 మంది సజీవదహనం

వియత్నాం రాజధాని హనోయిలో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వియత్నాం పబ్లిక్ సెక్యూరిటీ మంత్రిత్వ శాఖ గురువారం ఈ ఘటనను ధృవీకరించింది. మూడు అంతస్తుల కేఫ్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేఫ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉద్యోగులతో గొడవపడి, పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యక్తిగత కక్షతోనే ఈ పని చేశానని నిందితుడు అంగీకరించాడని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదం తర్వాత ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. అక్కడి మంత్రిత్వ శాఖ ప్రకారం, రెస్క్యూ బృందాలు మంటల మధ్య నుంచి ఏడుగురిని రక్షించారు. వీరిలో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
అయితే, హనోయ్‌లో ఇలాంటి ఘటన ఇది మొదటిసారి కాదు. కొద్ది నెలల క్రితం ఓ అపార్ట్‌మెంట్ భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనల తర్వాత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. స్థానికుల కథనం ప్రకారం, ప్రమాదం సమయంలో పేలుడు శబ్దాలు వినిపించాయని తెలిపారు. వెంటనే బయటకు పరుగెత్తగా మంటలు ఎగిసిపడుతూ కనిపించాయి. ఇది హనోయిలో అగ్నిప్రమాదాల పెరుగుదలను, భవిష్యత్తులో మెరుగైన భద్రతా చర్యల అవసరాన్ని స్పష్టం చేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com