UK PM: బ్రిటన్ ప్రధాని బరిలో రిషి సునాక్.. 100 మంది ఎంపీల మద్దతు..

UK PM: బ్రిటన్ ప్రధాని పదవి రేసులో కీలకమైన మైలు రాయిని అందుకున్నారు కన్సర్వేటివ్ పార్టీ లీడర్ రిషి సునాక్. పోటీలో నిలబడేందుకు అవసరమైన వంద ఎంపీల మద్దతును సునాక్ సాధించారు. రిషి సునాక్‌కు మద్దతు ఇచ్చిన వందో ఎంపీనంటూ టోబియాస్ ఎల్‌వుడ్ ట్వీట్ చేశారు. ఒకవేళ ప్రత్యర్థి వంద మంది ఎంపీల మద్దతు కూడగట్టడంలో విఫలమైతే సునాక్...ఆటోమెటిక్‌గా బ్రిటన్ ప్రధానమంత్రి పదవితో పాటు పార్టీ లీడర్‌గా ఎన్నికవుతాడు.
ఈ నెల 21న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. అక్టోబర్ 24 మధ్యాహ్నం 2 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 650 సీట్లు ఉన్న బ్రిటిష్ పార్లమెంట్‌లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి 357 మంది సభ్యులున్నారు. వారిలో ఎవరైనా పార్టీ అధ్యక్ష పదవికి, తద్వారా ప్రధానమంత్రి పదవికి పోటీ పడొచ్చు.
ప్రధాని పదవి కోసం ఇటీవల ట్రస్‌తో పోటీ పడి ఓడిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్.. కొత్త ప్రధానిగా ఎన్నికయ్యే సూచనలే బలంగా కనిపిస్తున్నాయి. అప్పట్లో రిషి సునాక్, లిజ్ ట్రస్‌లతో పాటు ప్రధాని పదవి కోసం పోటీ పడిన ఆర్థిక మంత్రి జెరెమీ హంట్ సైతం పోటీ నుంచి విరమించుకున్నట్లు ప్రకటించారు.
ట్రస్ చెప్తున్నట్లు పన్నులకు కోత పెట్టడం ఇబ్బందిగా మారుతుందని పదేపదే కన్జర్వేటివ్ పార్టీ నేతలను హెచ్చరించారు సునాక్. చివరకు ఆయన చెప్పిందే నిజమైంది. ప్రస్తుతం బ్రిటన్ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను రిషి మాత్రమే పరిష్కరించగలరని ఆయన మద్దతుదారులు చెప్తున్నారు.
ఈ సారి పోటీలోకి దిగొద్దని...తనకు అవకాశం కల్పించాలని బోరిస్ జాన్సన్ రిషిని కోరినట్లు బ్రిటిష్ మీడియాలో వార్తాలు వచ్చాయి. 2024 డిసెంబర్‌లో జరిగే ఎన్నికల్లో పార్టీని ఓటమి నుంచి కాపాడే సత్తా తనకు మాత్రమే ఉందని...పార్టీ ఎంపీలకు జాన్సన్ స్పష్టం చేసినట్లు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com