రోజు రోజుకూ పెరుగుతున్న బైజూస్‌ కష్టాలు

రోజు రోజుకూ పెరుగుతున్న బైజూస్‌ కష్టాలు
వ్యాల్యూయేషన్‌ మోజులో నిధుల కోసం పరుగులు పెట్టిన బైజూస్‌ ప్రమోటర్లు ఇపుడు...అప్పుల ఊబిలోకూరుకుపోయారు.

దేశంలో అతి పెద్ద ఎడ్యుటెక్‌ సంస్థ బైజూస్‌ కష్టాలు రోజు రోజుకూ తీవ్రం అవుతున్నాయి. వ్యాల్యూయేషన్‌ మోజులో నిధుల కోసం పరుగులు పెట్టిన బైజూస్‌ ప్రమోటర్లు ఇపుడు...అప్పుల ఊబిలోకూరుకుపోయారు. వాపును బలుపుగా భావించి ఆకాష్‌ కోచింగ్‌ సెంటర్‌ను భారీ వ్యాల్యూయేషన్‌తో కొన్నారు.అయితే పరిస్థితి తలకిందులైంది.2022లో కంపెనీ విలువ 2వేల200 కోట్ల డాలర్లు ఉంటే..ఈ ఏడాది 8 వందల 40 కోట్ల డాలర్లకు పడిపోయింది.ఇపుడు అప్పు తీర్చమని కోరుతున్నవారిపైనే కంపెనీ కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది. కరోనా టైంలో ఇష్టమొచ్చినట్లు విస్తరించిన బైజూస్‌ ఇపుడు మనుగడ సాగించడమే కష్టమనే వార్తలు వస్తున్నాయి.నెలల తరబడి బ్యాలెన్స్‌ షీట్లు ప్రకటించకపోవడంతో...కంపెనీ ఆర్థిక స్థితిగతులపై మార్కెట్‌లో అనుమానాలు పెరిగాయి.చివరికి ఆడిటర్‌ కంపెనీ నుంచి తప్పుకున్నారు.మార్కెట్‌లో పేరున్న ఆకాష్‌ కోచింగ్‌ సెంటర్‌ను పబ్లిక్‌ ఇష్యూకు తేవాలని కంపెనీ భావిస్తోంది. కానీ అకౌంట్లపైనే ఇపుడు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఇపుడు ఏకంగా కేంద్రమే బైజూస్‌ కంపెనీ ఖాతాల తనిఖీకి దిగింది. దీంతో ఆకాష్‌ పబ్లిక్‌ ఇష్యూ వస్తుందా? అసలు బైజూస్‌ ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడుతుందా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది.

మరోవైపు బైజూస్‌ ఖాతాలను పరిశీలించాలని కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ నిర్ణయించింది.కంపెనీ కార్పొరేట్‌ గవర్నన్స్‌పై కూడా అనుమానాలు రావడంతో ఈ కంపెనీ ఆర్థిక మూలాలను పరిశీలించాలని కేంద్రం నిర్ణయించింది. కంపెనీ నుంచి ఇండిపెండెంట్‌ డైరెక్టర్లు రాజీనామా చేయడంతో కంపెనీ బోర్డులో కేవలం ప్రమోటర్లు మాత్రమే మిగిలారు.కంపెనీ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌,ఆయన సోదరుడు,ఆయన భార్య మాత్రమే మిగిలారు. దీంతో కంపెనీ నిర్వహణ పూర్తిగా కుటుంబ సంస్థ చేతిలోకి వెళ్ళింది. ఇది మరో సంక్షోభానికి దారి తీస్తుందని భావించి ప్రమోటర్ల రాజీనామాలను ఇంకా ఆమోదించలేదు. మరోవైపు బైజూస్‌ వ్యవహారం అమెరికా మార్కెట్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. అంతర్జాతీయ రుణసంస్థలు బైజూస్‌ కార్పొరేట్‌ పనితీరుపై ఆందోళన వ్యక్తం చేయడంతో కేంద్రం రంగంలోకి దిగింది.బైజూస్‌ సంస్థ మాతృ కంపెనీ అయిన థింక్‌ అండ్‌ లెర్న్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై ఈడీ దాడులు కూడా నిర్వహించింది. కంపెనీ ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఇక తమ ట్యాబ్‌లు అమ్మే విషయంలో బైజూస్‌ కంపెనీ అనైతిక వ్యాపార కార్యకలాపాలకు పాల్పడుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. తప్పుడు హామీలతో ట్యాబ్‌లను అంటగడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.పైగా ట్యాబ్‌ల విలువను వాయిదాలలో వసూలు చేస్తూ...కంపెనీ ఖాతాల్లో మాత్రం మొత్తం ట్యాబ్‌ సొమ్ము వసూలైనట్లు చూపుతున్నారు. దీనికి కంపెనీ ఆడిటర్‌ తీవ్ర అభ్యంతరం తెలిపి వైదొలిగారు. పైగా కంపెనీ కూడా చట్టబద్ధంగా దాఖలు చేయాల్సిన బ్యాలెన్స్‌ షీట్‌ను కూడా సమర్పించలేదు. దీంతో ఈ కంపెనీ ఆర్థిక లా వాదేవీలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బైజూస్‌ అమ్మకాలు కూడా తగ్గుముఖం పట్టాయి.

అటు ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు ఆకాశ్‌ ఎడ్యుకేషన్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ను లిస్ట్‌ చేయాలని బైజూస్‌ ప్రతిపాదించింది. వచ్చే ఏడాదిలో పబ్లిక్‌ ఇష్యూ ప్రక్రియ ప్రారంభమవుతుందని బైజూస్‌ ప్రకటించింది. ఆకాష్‌ ఆదాయం గాడిన పడుతోందని, 2023- 24 నాటికి కంపెనీ ఆదాయం 4వేల కోట్లకు చేరుతుందని బైజూస్‌ అంచనా వేసింది. అయితే కంపెనీపై వస్తున్న ఆరోపణలు చూస్తుంటే ఆకాష్‌ పబ్లిక్‌ ఆఫర్‌కు కేంద్రం నుంచి అనుమతులు వస్తాయా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. మరోవైపు ఆకాష్‌ పబ్లిక్‌ ఆఫర్‌ అనుకున్న సమయానికి రాకుంటే... బైజూస్‌ ఆర్థిక కష్టాలు మరింత పెరిగే అవకాశముంది.

Tags

Read MoreRead Less
Next Story