Justin Trudeau: ఐక్యరాజ్యసమితి వేదికగా మళ్ళీ అదే మాట
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్‌ను ఉద్దేశిస్తూ మరో సంచలన ప్రకటన చేశారు. ఖలీస్థాన్ సానుభూతిపరుడు హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యోదంతం భారత్, కెనడాల మధ్య దౌత్య యుద్ధానికి ఆజ్యం పోసింది. నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల పాత్రపై తమకు విశ్వసనీయ సమాచారం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు, తరువాత పరిణామాలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నా. ఇక ఇప్పుడు తాజాగా, ఐక్యరాజ్యసమితి వేదికగా కెనడా ప్రధాని మరోసారి అదే ఆరోపణలు చేశారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందనేందుకు విశ్వసనీయ కారణాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. చట్టబద్ధమైన అంతర్జాతీయ దౌత్య సంబంధాలకు తాము కట్టుబడి ఉన్నామన్న ఆయన, కెనడా దర్యాప్తునకు భారత్ సహకరించాలని కోరారు.
‘‘సోమవారంపార్లమెంట్‌లో నేను మాట్లాడినట్టుగా కెనడా నేలపై కెనడా పౌరుడి హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందనేందుకు విశ్వసనీయ కారణాలు ఉన్నాయి. ఇది అత్యంత కీలకమైన వ్యవహారం. చట్టసభల వేదికగా నేను ఈ అంశాన్ని ప్రస్తావించాను. ఇది ఆషామాషీగా తీసుకున్న నిర్ణయం కాదు. అంతర్జాతీయంగా తన పలుకుబడి, ప్రాధాన్యత పెంచుకుంటున్న దేశం భారత్ అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. భారత్‌తో కెనడా కలిసి పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి.. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ అంశంలో పూర్తి పారదర్శకత దిశగా మాతో కలిసి పనిచేయాలని కోరుతున్నాం’’ అని ఆయన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. తమది చట్టబద్ధ పాలన ఉన్న దేశమని ప్రధని జస్టిన్ ట్రూడో చెప్పుకొచ్చారు. తమ విలువలు పరిరక్షించుకునేందుకు, దేశ పౌరులను కాపాడుకునేందుకు, అంతర్జాతీయంగా చట్టబద్ధ సంబంధాలు నెలకొల్పేందుకు తాము కృషి చేస్తామని పేర్కొన్నారు. ఇతర దేశాల్లోని పౌరుల హత్యతో మరో దేశానికి ప్రమేయం ఉండటం అస్సలు ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రధాని మోదీతో కూడా తాను చర్చించినట్టు చెప్పుకొచ్చారు.
మరోవైపు కెనడా ఆరోపణలపై గురువారం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. ‘అవును ఈ ఆరోపణలను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రధాని (మోదీ)తో లేవనెత్తారు.. ప్రధాని వాటిని తిరస్కరించారు’ అని పేర్కొంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com