Canada:41 మంది దౌత్యవేత్తలను రీకాల్ చేసిన కెనడా..

Canada:41 మంది దౌత్యవేత్తలను రీకాల్ చేసిన కెనడా..
భారత్‌‌పై మరోసారి విమర్శలు

భారత ప్రభుత్వం విధించిన గడువు ముగిసిన తరువాత కెనడా ప్రభుత్వం 41 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకుంది. ఈ సందర్బంగా మరోసారి భారత ప్రభుత్వంపై ట్రూడో ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. తమ దౌత్యవేత్తల ఉపసంహరణ విషయంలో భారత్ అనైతికంగా వ్యవహరిస్తోందని ఆరోపించింది. ఒట్టావా ప్రతీకార చర్యలు తీసుకోదని విదేశాంగ మంత్రి మెలానీ జోలి అన్నారు.

ఖలీస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ఏజెంట్ల పాత్ర ఉందంటూ కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడ్ చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఎన్నడూ లేని విధంగా దెబ్బతిన్నాయి. 40 మంది దౌత్య సిబ్బందిని వెనక్కి పిలిపించుకోవాలన్న భారత్ ఆదేశాలతో కెనడా చర్యలు చేపట్టింది. భారత్ నుంచి 41 మంది దౌత్య సిబ్బందిని ఉపసంహరించినట్టు కెనడా తాజాగా ప్రకటించింది.

శుక్రవారం నాటికి మా దేశానికి చెందిన 21 మంది దౌత్యవేత్తలు, వారి కుటుంబాలు మినహా అందరికీ దౌత్యపరమైన భద్రతను అనైతికంగా ఉపసంహరించుకోవాలని భారత్ యోచిస్తోంది.. ఒట్టావా మిగతావారిని ఉపసంహరించుకోవాల్సి వచ్చింది అని కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ చెప్పారు. వాళ్లు భారత్ నుంచి సురక్షితంగా బయలుదేరడానికి ఏర్పాట్లు చేశాం.. అంటే దీని అర్థం మా దౌత్యవేత్తలు, వారి కుటుంబాలు ఇప్పుడు ఆ దేశాన్ని విడిచిపెట్టారు అని ఆమె వ్యాఖ్యానించారు.


41 మంది దౌత్యవేత్తలకు దౌత్యపరమైన రక్షణను ఉపసంహరించుకోవడం అంతర్జాతీయ చట్టానికి విరుద్ధం అని, అయితే పరిస్థితిని మరింత దిగజార్చకుండా ప్రతీకారం తీర్చుకోవాడానికి కెనడా ప్లాన్ చేయలేదన్నారు. భారత్‌తో సంబంధాలు కొనసాగించడంలో నిమగ్నమై ఉంటుంది.. ఇప్పుడు మనకు క్షేత్రస్థాయిలో దౌత్యవేత్తలు అవసరం అని జోలీ పేర్కొన్నారు.

మరోవైపు, నిజ్జర్ హత్య కేసు దర్యాప్తునకు సహకరించాలన్న కెనడా విజ్ఞ‌ప్తిని తోసిపుచ్చిన భారత్.. ఈ ఆరోపణలతో తమకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు, భారత దౌత్యవేత్తను బహిష్కరించడాన్ని తీవ్రంగా పరిగణించిన భారత్.. న్యూఢిల్లీలోని కెనడా దౌత్యవేత్తను రెండు రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. అలాగే, కెనడా పౌరులకు వీసాలను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది.

దౌత్యసిబ్బంది సంఖ్య విషయంలో సమానత్వం ఉండాల్సిన అవసరముందని భారత్‌ గతంలోనూ కెనడా కు సూచించింది. నిజ్జర్‌ హత్యపై కెనడా ఆరోపణలతో ఈ అంశాన్ని మరోసారి ప్రస్తావించింది. ఒట్టావాలోని భారత దౌత్యసిబ్బంది సంఖ్యతో పోలిస్తే దిల్లీలో కెనడా దౌత్య సిబ్బంది సంఖ్య చాలా ఎక్కువగా ఉందని, దాన్ని సమస్థాయికి తీసుకురావాలని స్పష్టం చేసింది. దీనిని కెనడా మాత్రం కక్ష సాధింపు చర్యగా పరిగణిస్తోంది.

Tags

Next Story