Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన కెనడా

భారత్‌కు చెందిన కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నేతృత్వంలోని ముఠాపై కెనడా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బిష్ణోయ్ గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థగా అధికారికంగా ప్రకటింది. హత్యలు, కాల్పులు, దహనం, బెదిరింపుల ద్వారా ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్న కారణంగానే ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
కెనడా ప్రజా భద్రత శాఖ మంత్రి గ్యారీ ఆనందసంగరి ఈ విషయాన్ని వెల్లడించారు. బిష్ణోయ్ ముఠా ప్రధానంగా భారత్ నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నప్పటికీ, కెనడాలో కూడా తన ఉనికిని విస్తరించిందని తెలిపారు. ముఖ్యంగా, కెనడాలో స్థిరపడిన ప్రవాస భారతీయ వర్గాలను, వారి వ్యాపారాలను, ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా భయానక వాతావరణాన్ని సృష్టిస్తోందని ఆయన పేర్కొన్నారు.
క్రిమినల్ కోడ్ కింద బిష్ణోయ్ గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చడం వల్ల దానిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలవుతుందని ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయంతో కెనడాలో ఉన్న బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఆస్తులు, వాహనాలు, బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం లేదా స్వాధీనం చేసుకోవడం సాధ్యమవుతుంది. అంతేకాకుండా, ఈ సంస్థకు నిధులు సమకూర్చడం, సభ్యులను చేర్చుకోవడం వంటి చర్యలను తీవ్రమైన నేరాలుగా పరిగణించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
ఈ సందర్భంగా మంత్రి గ్యారీ ఆనందసంగరి మాట్లాడుతూ, “కెనడాలో నివసించే ప్రతి వ్యక్తికీ తమ ఇళ్లలో, సమాజంలో సురక్షితంగా జీవించే హక్కు ఉంది. బిష్ణోయ్ గ్యాంగ్ కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని హింసకు పాల్పడుతోంది. ఈ ముఠాను ఉగ్రవాద జాబితాలో చేర్చడం ద్వారా, వారి నేరాలను సమర్థంగా ఎదుర్కొని, అరికట్టడానికి మా భద్రతా సంస్థలకు మరింత శక్తివంతమైన సాధనాలు లభిస్తాయి” అని వివరించారు. ఈ నిర్ణయం వలస, శరణార్థుల రక్షణ చట్టం కింద దేశంలోకి ప్రవేశించే వారిపై నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అధికారులకు సహాయపడుతుందని ప్రభుత్వం పేర్కొంది.
ఇటీవల కెనడాలో కపిల్ శర్మకు చెందిన రెస్టారెంట్ పై కాల్పులు, ఇతర దాడులు, బెదిరింపులకు పాల్పడినట్టు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కెనడా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com