China: సరిహద్దు విషయంలో చైనా కవ్వింపు చర్యలు

డ్రాగన్ దేశం భారత్‌పై విషం చిమ్మడం ఆపడం లేదు. సరిహద్దు విషయంలో ఇండియాపై చైనా పదేపదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అరుణాచల్‌ప్రదేశ్, అక్సాయ్ చిన్ ప్రాంతాలను తమ భూభాగంలోనే ఉన్నట్లు చూపుతూ చైనా మ్యాప్ విడుదల చేసింది. అయితే దీనిపై భారత్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. మళ్లీ స్పందించిన ఇదంతా కూడా చట్ట ప్రకారమేనంటూ తాను చేసిన చర్యను సమర్థించుకుంది.
2023 సంవత్సారానికి సంబంధించి చైనా సోమవారం రోజు విడుదల చేసిన స్టాండర్డ్ మ్యాప్ తీవ్ర దుమారం రేపింది. భారత్, చైనా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్, తైవాన్ అలాగే దక్షిణ చైనా సముద్రాలను తమ దేశంలోని భూభాగాలుగా ఆ మ్యాప్‌లో పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్ ఉన్న ప్రాంతాన్ని దక్షిణ టిబెట్‌గా పేర్కొంది. ఇది సరిహద్దుల వివాదాలను మరింత రగల్చడమేనని భారత్ మండిపడింది. ఎలాంటి ఆధారాలు లేకుండానే చైనా ఈ మ్యాప్‌ను తయారు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. దౌత్యపరమైన మార్గాల్లో డ్రాగన్‌కు గట్టి నిరసన వ్యక్తం చేసినట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందర్ బాగ్జి తెలిపారు.
అటు చైనా మ్యాప్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. చైనా దురక్రామణ విషయంలో ప్రధాని మోదీ అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. చైనా మ్యాప్‌పై ప్రధాని ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. చైనాకు ఇలా ఆధారాలు లేకుండా మ్యాప్‌లను విడుదల చేసే అలవాటు ఉందని.. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. గతంలో కూడా ఇలాంటి చర్యలకు పాల్పడిందని చెప్పారు. అసంబద్ధ వాదనలు చేసి ఇతర భూభాగాలు తమవని చెప్పుకోలేరని అన్నారు. మరోవైపు భారత్ కొద్ది రోజుల్లో జి-20 శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇలాంటి సమయంలో చైనా ఈ మ్యాప్‌ను విడుదల చేయడం దుమారం రేపుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com