China : భారత్ ఆర్సిఈపీలో చేరితే ఎక్కువ కొనుగోలుకు సిద్ధమన్న చైనా.. అసలేంటి ఈ వాణిజ్య కూటమి?

China : భారత్, చైనా మధ్య దిగుమతులు ఎగుమతుల అంతరం గణనీయంగా ఉంది. చైనాతో స్వేచ్ఛా వాణిజ్యం చేయడానికి భారతదేశానికి భయం ఉండటానికి ఇదే కారణం. ఈ నేపథ్యంలో చైనా తాను భారతదేశం నుండి ఎక్కువ వస్తువులను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. అయితే, దానికి ఒక షరతు కూడా పెట్టింది. చైనా ప్రతిష్టాత్మక వాణిజ్య కూటమి అయిన ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (RCEP)లో భారతదేశం చేరాలి అనేది దాని షరతు.
చైనాలోని సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ స్టడీస్ డైరెక్టర్, ఆర్థికవేత్త లిఖింగ్ ఝాంగ్ ఈ ప్రకటన చేశారు. కౌటిల్య ఎకనామిక్స్ కాంక్లేవ్ కార్యక్రమంలో ఎకనామిక్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. భారతదేశం ఆర్సిఈపీలో చేరితే దాని వస్తువులకు స్వేచ్ఛా అవకాశం లభిస్తుందని ఝాంగ్ అన్నారు. ఆర్సిఈపీలో చేరితే దాని వస్తువులపై సుంకాలు ఒక దశాబ్దంలోపు సున్నాకి చేరుకుంటాయని చైనా ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. దీనివల్ల భారతీయ వస్తువులు మరింత పోటీతత్వంతో తయారవుతాయి.
ఆర్సిఈపీ అనేది వివిధ దేశాలు కలిసి చేసుకున్న ఒక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. ఇది ప్రధానంగా ఆసియా-పసిఫిక్ దేశాలను కలిగి ఉంది. ఆసియాన్ (ASEAN) దేశాలైన కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, థాయ్‌లాండ్ మొదలైనవి ఇందులో ఉన్నాయి. ఆసియా పవర్ఫుల్ దేశమైన చైనా ఉంది. పసిఫిక్ దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మొదలైనవి కూడా ఉన్నాయి. 2011లో ఆర్సిఈపీ ప్రణాళిక ప్రతిపాదించబడింది. 2012లో ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలో ఇది ప్రారంభమైంది. 2020లో వివిధ దేశాలు ఒప్పందంపై సంతకాలు చేయడంతో ఆర్సిఈపీ అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించింది.
ప్రారంభంలో భారతదేశం కూడా ఈ కూటమిలో చేరడానికి ప్రయత్నించింది. అయితే, ఈ కూటమిలో చైనా ఆధిపత్యం కలిగి ఉండటం, ఆ దేశం భారతదేశంపై సరిహద్దు సంఘర్షణలు సృష్టించడం వంటి కారణాల వల్ల భారతదేశం ఆర్సిఈపీ నుండి పూర్తిగా వైదొలిగింది. భారత్ తన దేశీయ పరిశ్రమలకు నష్టం జరుగుతుందని, ముఖ్యంగా చైనా నుండి చౌక దిగుమతులతో మార్కెట్ నిండిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్సిఈపీ ఒప్పందంపై 15 దేశాలు సంతకాలు చేశాయి. ఈ దేశాలు ప్రపంచ జీడీపీలో 30%, ప్రపంచ జనాభాలో 30% వాటాను కలిగి ఉన్నాయి.
ఈ ఒప్పందం ప్రకారం సభ్య దేశాల మధ్య వాణిజ్యంలో 90% సుంకాలను తొలగిస్తారు. పూర్తి సుంకం రహిత వాణిజ్యాన్ని నిర్వహించడం దీని ప్రధాన లక్ష్యం. తద్వారా వస్తువుల ధరలు తగ్గి, దేశాల మధ్య వాణిజ్యం పెరుగుతుంది. ఆర్సిఈపీ సభ్య దేశాల మధ్య ఆర్థిక అనుసంధానాన్ని పెంపొందించడం, సరఫరా గొలుసులను బలోపేతం చేయడం, ప్రాంతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా సభ్య దేశాలన్నిటికీ ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com