Love story : అంతర్జాతీయ ప్రేమ కధలు

ఒక వార్త బయటకు వస్తే అలాంటి వార్తలే మళ్ళీ మళ్ళీ బయటపడతాయి అన్న మాట నిజం చేస్తూ దేశాలు దాటుతున్న ప్రేమ కథలు విపరీతమైపోయాయి. సీమ సచిన్ల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, తరువాత అంజు లవ్ స్టోరీ హడావిడి చేసింది. ఇక ఇది కూడా ఒక ఇంటర్నేషనల్ లవ్ స్టోరీ.
తాజాగా ఓ చైనా యువతి స్నాప్‌చాట్‌లో పరిచయమైన తన ప్రియుడి కోసం పాక్‌లోకి ఎంటర్ అయ్యింది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ బజౌర్ ట్రైబల్ జిల్లాకు చెందిన యువకుడి కోసం ఆమె రోడ్డు మార్గం గుండా పాక్ కు చేరినట్లు పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. 21 ఏళ్ల చైనా యువతి గావ్ ఫెంగ్ మూడు నెలల వీసాపై బుధవారం పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ చేరుకుంది. ఆమె ప్రియుడు 18 ఏళ్ల జావేద్ ఆమెను రిసీవ్ చేసుకున్నాడు. అయితే బజౌర్ ట్రైబల్ జిల్లా అఫ్గాన్‌కు సరిహద్దులో ఉండటం తో భద్రతా కారణాల రీత్యా ప్రియురాలు గావ్ ఫెంగ్‌ను పక్కనే ఉండే దుగ్వా దిర్ జిల్లా సమర్‌బాగ్ తహశీల్ పరిధిలో నివాసం ఉండే తన మేనమామ ఇంటికి తీసుకెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇద్దరికీ మూడేళ్లుగా పరిచయం ఉందని తెలిపారు. స్నాప్‌చాట్ ద్వారా మొదలైన వారి స్నేహం ప్రేమగా మారిందని వెల్లడించారు. చైనా యువతి ప్రయాణ పత్రాలన్నీ సక్రమంగానే ఉన్నట్లు గుర్తించామని, వారికి ఇంకా వివాహం కాలేదని స్పష్టం చేశారు.
అన్నీ సుఖాంతాలు కావు..
ఇక ఇలాంటిదే మరో స్టోరీ. 2017లో బంగ్లాదేశ్ కు చెందిన నుంచి జూలీ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అజయ్ అనే వ్యక్తిని వివాహం చేసుకునేందుకు వచ్చేసింది. వీరి ఫేస్‌బుక్ స్నేహం ప్రేమగా మారింది. 2022లో జూలీ భర్త చనిపోయాడు. దీంతో అజయ్ సూచన మేరకు బంగ్లాదేశ్ నుంచి ఆమె భారత్‌కు పూర్తిగా వచ్చేసింది. కుటుంబ సభ్యుల సమక్షంలో వారిద్దరి పెళ్లి జరిగింది. అయితే, వృత్తి రీత్యా అజయ్ కర్ణాటకలో ఉండాల్సి రావడంతో.. భార్యను ఇంటి వద్దనే ఉంచాడు. ఇక అత్తాకోడళ్ల మధ్య గొడవలు తలెత్తాయి. అవి తీవ్రం కావడంతో కోపంతో జూలీ తన పుట్టింటికి వెళ్లిపోయింది. కుమారుడు వచ్చి తల్లిని ప్రశ్నించడంతో తల్లి కొడుకుని కూడా ఇంట్లోంచి వెళ్ళగొట్టింది. దీంతో అజయ్ కోపంతో ఇల్లు వదిలి బంగ్లాదేశ్‌కి వెళ్లిపోయాడు. ఇప్పుడు తాజాగా బంగ్లాదేశ్‌లో తన కుమారుడు నరకయాతన అనుభవిస్తున్నాడంటూ రక్తమోడుతున్న ఫొటోతో వెళ్లి అతడి తల్లి ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతడిని భారత్‌కు రప్పించారు. అయితే అక్కడ ఏం జరిగింది? గాయాలకు కారణాలేంటి? అనే విషయాలు మాత్రం బయటకి రాలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com