మళ్లీ అమెరికాను భయపెడుతున్న కరోనా వైరస్‌

మళ్లీ అమెరికాను భయపెడుతున్న కరోనా వైరస్‌
X

కరోనా మళ్లీ భయపడుతోంది. అగ్రరాజ్యం గజగజా వణికిపోతోంది. అమెరికాలో రోజురోజుకీ కరోనా కొత్త కేసులు పతాక స్థాయిలో నమోదవుతున్నాయి. ఇప్పటికే అక్కడ కరోనా కేసులు సంఖ్య కోటి దాటింది. మహమ్మారి ఉనికిలోకి వచ్చిన తర్వాత ఈ స్థాయి కేసులు నమోదైన తొలి దేశం అమెరికానే.. అలాగే ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య ఐదు కోట్లు దాటింది.

అమెరికాలో గత పదిరోజుల్లో దాదాపు పది లక్షల కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 1 కోటి 51 వేలు దాటింది. ఫ్రాన్స్‌, భారత్‌ల్లో నమోదవుతున్న సగటు కేసులను కలిపినా.. అగ్రరాజ్యంలో 29 శాతం కేసులు అదనంగా నమోదవుతున్నాయి. ఇక కొత్తగా వేయికిపైగా మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2 లక్షల 38వేలకు పెరిగింది. వరుసగా ఐదోరోజు వెయ్యికి పైగా మరణాలు నమోదవుతుండడం ఆందోళన పెంచుతోంది. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న ప్రతి 11 కరోనా మరణాల్లో ఒకటి అమెరికాలోనే ఉంటోంది.

పశ్చిమ మధ్య ప్రాంతంలో కేసుల తీవ్రత భారీ స్థాయిలో ఉంది. డకోటా రాష్ట్రాలు, విస్కాన్సిన్‌, ఐయోవా, నెబ్రాస్కా రాష్ట్రాలు గడ్డుకాలం ఎదుర్కొంటున్నాయి. తాజాగా ఇల్లినాయిలో వ్యాప్తి ప్రారంభమవుతోంది. అమెరికాలో నమోదైన కేసుల్లో 10 శాతం కేసులు ఒక్క టెక్సాస్‌లోనే ఉన్నాయి. అమెరికాలో పదిలక్షల కేసులు దాటిన తొలి రాష్ట్రం అదే. నవంబరు తొలి వారంలో అమెరికాలో 10.5 మిలియన్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీటిలో 6.22 శాతం పాజిటివ్‌గా తేలాయి. అంతకు ముందు వారం ఇది 6.17శాతంగా ఉంది.

అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ కరోనా మహమ్మారి కట్టడే తన తొలి ప్రాధాన్యమని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన సోమవారం 12 మందితో కూడిన ప్రత్యేక కార్యదళాన్ని ప్రకటించే అవకాశం ఉంది. భారత సంతతికి చెందిన ప్రముఖ వైద్యుడు వివేక్‌మూర్తి దీనికి నేతృత్వం వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags

Next Story