31 July 2021 11:00 AM GMT

Home
 / 
అంతర్జాతీయం / ప్రపంచవ్యాప్తంగా మళ్లీ...

ప్రపంచవ్యాప్తంగా మళ్లీ విజృంభిస్తున్న వైరస్..!

మార్చి-ఏప్రిల్ మధ్య ఆర్-ఫ్యాక్టర్ ఒకటిగా ఉంది. అంటే వంద మంది కరోనా బాధితుల నుంచి మరో వంద మందికి ఇన్ఫెక్షన్ సోకింది.

ప్రపంచవ్యాప్తంగా మళ్లీ విజృంభిస్తున్న వైరస్..!
X

భారత్‌లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇది సింపుల్‌ స్టేట్‌మెంటే అనుకుంటే పొరపడినట్టే. సెకండ్‌వేవ్‌కు ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో సేమ్‌ టు సేమ్‌ ఇప్పుడు కూడా అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆర్-ఫ్యాక్టర్ గురించే. మార్చి-ఏప్రిల్ మధ్య ఆర్-ఫ్యాక్టర్ ఒకటిగా ఉంది. అంటే వంద మంది కరోనా బాధితుల నుంచి మరో వంద మందికి ఇన్ఫెక్షన్ సోకింది. ఇప్పుడు కూడా ఆర్‌-ఫ్యాక్టర్ ఒకటికి చేరువవుతోంది. వచ్చే రెండు వారాల్లో కరోనా విస్పోటనం ఖాయం అని ఈ ఆర్-ఫ్యాక్టర్ చెబుతోంది.

దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసులు 40వేలకు తక్కువ కాకుండా నమోదవుతున్నాయి. కేరళ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కర్నాటకలో సైతం 19 రోజుల తర్వాత కేసులు 2వేలు దాటాయి. బెంగళూరులో కంటైన్‌మెంట్‌ జోన్స్‌ 25శాతం పెరిగాయి. మహారాష్ట్రలో 7 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. తమిళనాడులోనూ మూడు రోజుల నుంచి కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. చెన్నై సహా 20 జిల్లాల్లో కేసులు పెరుగుతున్నట్టు అక్కడి వైద్య అధికారులు చెబుతున్నారు. కేరళలో కరోనా కేసులు పెరగడంతో.. కర్నాటకకు వచ్చే పొరుగురాష్ట్రం వారికి పరీక్షలు తప్పనిసరి చేసింది. కేరళలో జులై 1 నాటికి లక్ష యాక్టివ్ కేసులుండగా.. ఇప్పుడు లక్షన్నర దాటాయి. దీంతో కరోనాను కట్టడి చేసేందుకు కేరళ ప్రభుత్వం వీకెండ్‌ లాక్‌డౌన్ విధించింది.

కేరళ అనుభవంతో తమిళనాడు ముందు జాగ్రత్తలో పడింది. ఇప్పటివరకు అమలులో ఉన్న నిబంధనలను ఆగస్ట్ 9వరకు పొడిగిస్తూ తమిళనాడు సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో రాత్రి 9 గంటల వరకే షాపులు తెరచి ఉంటాయి. ఆ తర్వాత ఎవరికీ రోడ్లపైకి తిరిగే అనుమతి లేదు. ఏపీలోనూ నైట్ కర్ఫ్యూని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక తెలంగాణ, ఏపీల్లో రెండు డెల్టాప్లస్ కేసులు నమోదు అయినట్టు కేంద్రమంత్రి జితేంద్రసింగ్ పార్లమెంట్‌లో తెలిపారు. తెలంగాణలో థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం.. గాంధీ సూపరింటెండెంట్ ఇప్పటికే హెచ్చరించారు కూడా. రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ, గుంటూరు, విశాఖలోనూ రాబోయే రోజుల్లో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

వ్యాక్సినేషన్‌ పూర్తి చేసిన దేశాలు మాస్కులకు సెలవు అని ప్రకటించాయి. అది ఎంత తప్పో డెల్టా వేరియంట్‌ తెలిసొచ్చేలా చేసింది. ఆయా దేశాల్లో వ్యాక్సిన్ తీసుకున్నా సరే కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దెబ్బకు రెండు డోసుల టీకాలు తీసుకున్నా సరే మాస్కులు పెట్టుకోవాల్సిందేనంటూ ఆదేశాలిచ్చాయి. అమెరికా ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఆదేశాలు చూస్తుంటే.. మాస్కులతో సహజీవనం చేయక తప్పదనిపిస్తోంది. కొన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తైంది. అయినప్పటికీ, కరోనా వైరస్ విజృంభిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్‌లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వ్యాక్సిన్‌ వేయించుకున్న వాళ్లంతా మాస్క్‌ పెట్టుకోవక్కర్లేదంటూ ప్రకటించారు. మాస్కులు విసిరేస్తూ ఫొటోలకు కూడా పోజ్ ఇచ్చారు. తీరా చూస్తే సీన్ రివర్స్‌ అయింది. అమెరికాలో ఒక్కరోజే 90వేల కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో థర్డ్‌ వేవ్‌ వచ్చేస్తోందంటూ వార్నింగ్‌ ఇస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా థర్డ్‌వేవ్‌ రాబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వచ్చే రెండు వారాల్లో ఇండియాలోనూ థర్డ్‌వేవ్‌ మొదలవొచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని దేశాల్లో అయితే ఏకంగా ఫోర్త్‌ వేవ్‌ మొదలవబోతోంది. ముఖ్యంగా డెల్టా వేరియంట్‌ శక్తివంతంగా మారుతోంది. దీంతో కరోనా వ్యాప్తి వేగంగా పెరగడంతో పాటు డ్యామేజ్‌ కూడా ఎక్కువగానే చేస్తోంది. మరోవైపు ఫైజర్, ఆస్ట్రాజెనెకా వంటి సంస్థలు తయారు చేసిన వ్యాక్సిన్లపై కొన్ని దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఫైజర్ వ్యాక్సిన్‌ తొలి డోసు టీకా కేవలం 34 శాతమే ప్రభావవంతంగా పనిచేస్తోందని చెబుతున్నాయి. అంటే వంద మంది వ్యాక్సిన్‌ తీసుకుంటే అందులో 66 మందికి మళ్లీ వైరస్‌ సోకి ఆస్పత్రిలో చేరేంత పరిస్థితులకు దారితీస్తున్నాయి. దీంతో వ్యాక్సిన్‌ వేయించుకున్నా సరే మాస్కులు తీయొద్దని అనౌన్స్‌ చేస్తున్నాయి దేశాలు. భౌతికదూరం, శానిటైజర్లు తప్పనిసరిగా మెయిన్‌టైన్‌ చేయాల్సిందేనని చెబుతున్నాయి.

ఇజ్రాయెల్‌ తన దేశ పౌరులందరికీ వ్యాక్సిన్‌ వేయించింది. వ్యాక్సినేషన్ అయిపోగానే మాస్కులు తీసేయండని కూడా ప్రకటించింది. కాని, ఆ వ్యాక్సిన్‌ ప్రభావం కేవలం 41 శాతంగానే ఉందని ఈ మధ్య ప్రకటించింది. అంటే, వ్యాక్సిన్‌ వేయించుకున్న వారిలో వందకు 59 మంది డేంజర్‌ జోన్‌లో ఉన్నట్టేనని స్పష్టం చేసింది. అందుకే, ఇజ్రాయెల్‌లో మూడో డోస్‌ వ్యాక్సినేషన్‌ను మొదలుపెడుతున్నారు. ఇక సింగపూర్​ సహా పలు దేశాల్లో టీకా తీసుకున్న వాళ్లు వైరస్​ బారిన పడుతున్నారు. అటు అమెరికా కూడా టీకా తీసుకున్న వాళ్లు కూడా తప్పనిసరిగా మాస్క్‌ వాడాలని చెబుతోంది. మొత్తానికి డెల్టా వేరియంట్‌ ప్రపంచ దేశాలను ఓ కుదుపు కుదిపేస్తోంది. ఎప్పటికప్పుడు తన రూపు మార్చుకోవడంతో మరింత డేంజర్‌గా మారింది. అందుకే, డెల్టా రకం కరోనా వైరస్‌కు ప్రపంచం మొత్తం వణికిపోతోంది.

Next Story