Crude Oil Investment : మండిపోతున్న చమురు ధరలు.. ఇన్వెస్టర్లకు మాత్రం కాసుల పంట.

Crude Oil Investment : మండిపోతున్న చమురు ధరలు.. ఇన్వెస్టర్లకు మాత్రం కాసుల పంట.
X

Crude Oil Investment : పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ సెగలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వణికిస్తున్నాయి. 2026 ఫిబ్రవరి 28న ఇరాన్-అమెరికా మధ్య మొదలైన ప్రత్యక్ష ఘర్షణలు, సముద్ర మార్గాల్లో చమురు నౌకల రాకపోకలకు ఏర్పడిన ముప్పు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలకు రెక్కలు తెచ్చాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయన్న భయం సామాన్యుడిని ఆందోళనకు గురిచేస్తుంటే, తెలివైన ఇన్వెస్టర్లు మాత్రం ఈ సంక్షోభాన్ని ఒక లాభదాయకమైన అవకాశంగా మార్చుకుంటున్నారు. చమురు ధరల పెరుగుదల నుంచి సామాన్య ఇన్వెస్టర్లు ఎలా లాభం పొందవచ్చో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

చమురు ధరలు అకస్మాత్తుగా ఎందుకు పెరిగాయి?

ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ 10 కోట్ల బ్యారెళ్ల కంటే ఎక్కువ ముడి చమురు వినియోగం జరుగుతోంది. మన రవాణా, పరిశ్రమలు అన్నీ దీనిపైనే ఆధారపడి ఉన్నాయి. అయితే ఫిబ్రవరిలో యుద్ధం మొదలవ్వకముందు 66 డాలర్ల వద్ద ఉన్న బ్యారెల్ ధర, కేవలం కొన్ని వారాల్లోనే 110 డాలర్ల మార్కును దాటేసింది. సరఫరాలో చిన్న అంతరాయం కలిగినా లేదా యుద్ధ భయం నెలకొన్నా ట్రేడర్లు భారీగా కొనుగోళ్లు జరపడం వల్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చమురు బావుల దగ్గర యుద్ధం జరుగుతుండటంతో ఇన్వెస్టర్లు ముందస్తు జాగ్రత్తగా చమురును నిల్వ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

సాధారణ ఇన్వెస్టర్లు చమురులో ఎలా పెట్టుబడి పెట్టాలి?

చమురులో పెట్టుబడి పెట్టడం అంటే మనం డబ్బాల్లో ఆయిల్ కొని ఇంట్లో పెట్టుకోవడం కాదు. దీనికి అత్యంత సులభమైన మార్గం ఆయిల్ ఈటీఎఫ్. గ్లోబల్ ట్రేడింగ్ అకౌంట్ ఉంటే అమెరికా మార్కెట్‌లో లిస్ట్ అయిన యునైటెడ్ స్టేట్స్ ఆయిల్ ఫండ్ వంటి వాటిలో డబ్బులు పెట్టవచ్చు. ఒకవేళ మీకు విదేశీ మార్కెట్ల తలనొప్పులు వద్దనుకుంటే, భారతీయ స్టాక్ మార్కెట్‌లోనే లభించే ఎనర్జీ ఈటీఎఫ్ లేదా ఓఎన్‌జీసీ వంటి చమురు కంపెనీల షేర్లలో పెట్టుబడి పెట్టవచ్చు. వీటికి మన దేశీయ ఈక్విటీ పన్ను నిబంధనలే వర్తిస్తాయి కాబట్టి లెక్కలు కూడా సులభంగా ఉంటాయి.

షేర్ మార్కెట్ లేదా ఎంసీఎక్స్ ?

ముడి చమురు ధరలు పెరిగినప్పుడు గ్లోబల్ మార్కెట్‌లో ఎక్సాన్ మొబిల్, షెవ్రాన్, బీపీ వంటి దిగ్గజ కంపెనీలకు భారీ లాభాలు వస్తాయి. వాటి షేర్లు కొనడం ద్వారా మీరు లాభాలను అందుకోవచ్చు. ఇక మార్కెట్‌పై మంచి అవగాహన ఉన్నవారు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ వైపు వెళ్లవచ్చు. ఇక్కడ ఫ్యూచర్స్ కాంట్రాక్టుల ద్వారా ట్రేడింగ్ జరుగుతుంది. అయితే ఇది కొంత రిస్క్ తో కూడుకున్నది కాబట్టి అనుభవం ఉన్న ట్రేడర్లు మాత్రమే దీనిని ఎంచుకోవడం మంచిది. ఎంసీఎక్స్ ద్వారా వచ్చే లాభాలను బిజినెస్ ఇన్‌కమ్ గా పరిగణిస్తారు, కాబట్టి మీ టాక్స్ స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తలు

చమురు మార్కెట్ ఎంత లాభాన్ని ఇస్తుందో, అంతే అస్థిరంగా కూడా ఉంటుంది. యుద్ధం ముగిసినా లేదా ఒపెక్ దేశాలు ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించినా ధరలు ఒక్కసారిగా పడిపోయే అవకాశం ఉంది. అందుకే పెట్టుబడి పెట్టే ముందు ప్రపంచ రాజకీయ పరిస్థితులు, డాలర్ విలువ వంటి అంశాలను గమనించాలి. మొత్తం డబ్బును ఒకే చోట పెట్టకుండా, మీ పోర్ట్‌ఫోలియోలో కొంత భాగాన్ని మాత్రమే చమురు రంగానికి కేటాయించడం క్షేమకరం. దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకు వెళ్తేనే ఇలాంటి కమోడిటీ మార్కెట్లలో నిలదొక్కుకోగలరని నిపుణులు సూచిస్తున్నారు.

Tags

Next Story