Crude Oil : భగ్గుమంటున్న చమురు ధరలు.. $105 దాటిన బ్రెంట్ క్రూడ్.. హోర్ముజ్ సెగతో ప్రపంచం విలవిల.

Crude Oil : భగ్గుమంటున్న చమురు ధరలు.. $105 దాటిన బ్రెంట్ క్రూడ్.. హోర్ముజ్ సెగతో ప్రపంచం విలవిల.
X

Crude Oil : పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ కూటమి వర్సెస్ ఇరాన్ మధ్య సాగుతున్న పోరు సోమవారంతో మూడో వారంలోకి ప్రవేశించింది. ఈ ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతింది. దీనివల్ల సోమవారం ఉదయం నుంచే ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 2.01 డాలర్లు పెరిగి 105.15 డాలర్లకు చేరుకోగా, డబ్ల్యూటీఐ క్రూడ్ కూడా 100.32 డాలర్ల మార్కును దాటేసింది. ఒక్క నెలలోనే చమురు ధరల్లో 40 శాతానికి పైగా పెరుగుదల కనిపించడం గమనార్హం.

ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇరాన్‌కు చెందిన ప్రధాన చమురు ఎగుమతి కేంద్రం ఖార్గ్ ఐలాండ్ పై దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ ఎగుమతి చేసే చమురులో 90 శాతం ఇక్కడి నుంచే వెళ్తుంది. ట్రంప్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే యూఏఈలోని ఫుజైరా చమురు టెర్మినల్‌పై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో అక్కడ లోడింగ్ పనులకు తాత్కాలికంగా ఆటంకం కలిగింది. హోర్ముజ్ జలసంధి గుండా ప్రపంచానికి అందే చమురులో 20 శాతం ప్రయాణిస్తుంది కాబట్టి, ఈ మార్గం మూతపడటం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా పరిణమించింది.

చమురు ధరల పెరుగుదలను అరికట్టేందుకు అంతర్జాతీయ ఇంధన సంస్థ రంగంలోకి దిగింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సుమారు 40 కోట్ల బ్యారెళ్ల అత్యవసర చమురు నిల్వలను మార్కెట్లోకి విడుదల చేయాలని నిర్ణయించింది. ఆసియా దేశాల నిల్వలను తక్షణమే విడుదల చేస్తుండగా, ఐరోపా మరియు అమెరికా నిల్వలు మార్చి నెలాఖరు వరకు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు, హోర్ముజ్ జలసంధిలో నౌకల భద్రత కోసం అంతర్జాతీయ కూటమిని ఏర్పాటు చేయాలని ట్రంప్ యోచిస్తున్నారు. దీనికోసం తన మిత్ర దేశాల యుద్ధనౌకలను పంపాలని ఆయన కోరారు.

యుద్ధం మూడో వారంలోకి అడుగుపెట్టినప్పటికీ, చర్చల ద్వారా సమస్య పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదు. అమెరికా ప్రతిపాదించిన చర్చలను ఇరాన్ తోసిపుచ్చింది. తమపై దాడులు ఆపేవరకు కాల్పుల విరమణకు అంగీకరించబోమని ఇరాన్ తెగేసి చెప్పింది. అయితే, అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్ మాత్రం ఈ యుద్ధం మరో కొన్ని వారాల్లో ముగిసే అవకాశం ఉందని, ఆ తర్వాత చమురు ధరలు మళ్లీ సాధారణ స్థితికి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి మాత్రం సామాన్యుడిపై పెట్రో భారం పడటం ఖాయంగా కనిపిస్తోంది.

Tags

Next Story