US Politician : భారతీయులను అమెరికా నుంచి బహిష్కరించాలి : అమెరికా పొలిటీషియన్

భారతీయులు ఎవరూ అమెరికా గురించి ఆలోచించరని ఆరోపిస్తూ వారందరినీ వెనక్కి పంపించేయాలని అమెరికా రాజకీయ నేత చాండ్లర్ లాంగేవిన్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ భారత సంతతి అమెరికన్లతో పాటు అమెరికన్లలోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అమెరికాలో విద్వేషానికి చోటులేదని, చాండ్లర్ వ్యాఖ్యలు విద్వేషపూరితమైనవేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్లోరిడాకు చెందిన చాండ్లర్ లాంగేవిన్ స్థానిక పామ్ బే సిటీ కౌన్సిల్‌కు చెందిన కన్జర్వేటివ్ నాయకుడు. ఈ వివాదాస్పద పోస్టు నేపథ్యంలో చాండ్లర్ పై పామ్ బే సిటీ కౌన్సిల్ చర్యలు తీసుకుంది.
గత నెలలో ఓ భారతీయ ట్రక్ డ్రైవర్ చేసిన ప్రమాదంలో అమెరికన్ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ వార్తను సోషల్ మీడియాలో పంచుకుంటూ.. అమెరికాలోని భారతీయులందరినీ వెంటనే బహిష్కరించాలని చాండ్లర్ పోస్ట్ చేశారు. భారతీయులు అమెరికాను అస్సలు పట్టించుకోరని, వారు మనల్ని ఆర్థికంగా దోచుకుంటున్నారని చాండ్లర్ తన పోస్టులో పేర్కొన్నారు. అమెరికా కేవలం అమెరికన్ల కోసమేనని మరో పోస్టులో వ్యాఖ్యానించారు.
తన పుట్టిన రోజు సందర్భంగా చాండ్లర్ సోషల్ మీడియాలో పెట్టిన మరో పోస్టులో.. ‘నా పుట్టినరోజు సందర్భంగా అమెరికాలోని ప్రతీ భారతీయుడినీ బహిష్కరించాలని కోరుకుంటున్నా’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ట్యాగ్ చేశారు. చాండ్లర్ తన పోస్టుల్లో భారతీయులపై విద్వేషం వెల్లగక్కడంపై సిటీ కౌన్సిల్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. భారత సంతతి ప్రజలతో పాటు స్థానికులు కూడా పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో చాండ్లర్ ను కమిటీ నుంచి తప్పిస్తూ సిటీ కౌన్సిల్ చర్యలు తీసుకుంది. ఇకపై ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశించింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com