Trump: భారత్‌పై మరోసారి ట్రంప్‌ ఆక్రోషం..

Trump: భారత్‌పై మరోసారి ట్రంప్‌ ఆక్రోషం..
X
టారిఫ్‌లు మరింత పెంచుతా..

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌ను టార్గెట్ చేస్తూ కఠిన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి భారత ఇంధన కొనుగోళ్లపై తాజాగా ఆయన తీవ్రంగా స్పందించారు. భారత్ రష్యా నుంచి పెద్దఎత్తున చమురు కొనుగోలు చేస్తోంది. అందులో ఎక్కువ భాగాన్ని మళ్లీ ఓపెన్ మార్కెట్‌లో అమ్మేసి లాభాలు పొందుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వల్ల ఎంతమంది ప్రాణాలు తీస్తోందో వీళ్లకి పట్టదు అంటూ ట్రంప్ ఆరోపించారు. ఈ కారణంగా భారత్ నుంచి వచ్చే దిగుమతులపై తీవ్రంగా టారిఫ్‌లు పెంచబోతున్నానని హెచ్చరించారు.

ఇప్పటికే ఆయన భారత్‌కు 25 శాతం టారిఫ్ విధించనున్నట్టు ప్రకటించగా, ఇప్పుడు అదనంగా మరో చర్య ఉండబోతుందని చెబుతూ వివరాలు మాత్రం వెల్లడించలేదు. ట్రంప్ ఈ వ్యాఖ్యలు ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేయడం గమనార్హం. భారత ప్రభుత్వం దీనిపై స్పందిస్తూ ఈ పెంచిన టారిఫ్‌ల ప్రభావం స్వల్పమే, దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఉండదని వెల్లడించింది.

ఇటీవలే కేంద్రం స్పష్టంగా చెప్పినట్టు, భారత చమురు కొనుగోళ్లు జాతీయ ప్రయోజనాలు, మార్కెట్ ధరలపై ఆధారపడి ఉంటాయి. ఎలాంటి విదేశీ ఒత్తిడికి తావివ్వమని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. భారత్ ప్రస్తుతం ప్రపంచంలో మూడవ అతిపెద్ద క్రూడ్ ఆయిల్ దిగుమతిదారు. రష్యా చమురును పశ్చిమ దేశాలు నిషేధించిన తర్వాత, రష్యా భారీ తగ్గింపుతో ఆయిల్ అందించడంతో భారత్ మార్కెట్ దిశ మార్చుకుంది. రోజుకు సుమారు 20 లక్షల బ్యారెల్స్ చమురు భారత్ దిగుమతీ చేసుకుంటుంది. ఇది గ్లోబల్ సప్లైలో సుమారు 2 శాతం.

ఇక ట్రంప్ మరోసారి భారత్‌పై మాట్లాడుతూ.. భారత్‌ అత్యంత కఠినమైన నాన్-మానిటరీ ట్రేడ్ బారియర్లు కలిగిన దేశం. వారి టారిఫ్‌లు ప్రపంచంలో అత్యధికంగా ఉంటాయి అంటూ విమర్శలు గుప్పించారు. భారత్‌తో అమెరికాకు భారీ వాణిజ్య లోటు ఉందన్న ఆరోపణలు చేశారు. ఇక ట్రంప్ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వ వర్గాలు మౌనంగా ఉండకుండా.. ప్రధాని నరేంద్ర మోడీ స్వదేశీ ఉత్పత్తుల ప్రాధాన్యాన్ని మరోసారి రిపీట్ చేశారు. వారణాసిలో జరిగిన సభలో మాట్లాడిన ఆయన.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్థిరతలో ఉంది. ఇలాంటి సమయంలో ప్రతి దేశం తన ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తోంది. భారత్ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడానికి వేగంగా పయనిస్తోందని, అందుకే మనమూ మన స్వదేశీ ప్రాధాన్యతను మరువకూడదు అంటూ పిలుపునిచ్చారు.

Tags

Next Story