Dubai Princess : ర్యాపర్ ఫ్రెంచ్ మోంటానాతో దుబాయ్ యువరాణి షేకా మహ్రా ఎంగేజ్‌మెంట్..!

Dubai Princess  : ర్యాపర్ ఫ్రెంచ్ మోంటానాతో దుబాయ్ యువరాణి షేకా మహ్రా ఎంగేజ్‌మెంట్..!
X

దుబాయ్ యువరాణి షేకా మహ్రా మొహమ్మద్ రషీద్ అల్ మక్తూమ్ మరోసారి వార్తల్లో నిలిచారు. గత సంవత్సరం తన భర్త నుంచి విడాకులు తీసుకుని సంచలనం సృష్టించిన ఆమె, ఇప్పుడు ప్రముఖ ర్యాపర్ ఫ్రెంచ్ మోంటానాతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని ర్యాపర్ ప్రతినిధి అధికారికంగా ధృవీకరించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

గత కొద్దికాలంగా డేటింగ్‌లో..

గత కొంతకాలంగా షేకా మహ్రా, ఫ్రెంచ్ మోంటానా (40) డేటింగ్‌లో ఉన్నట్లు పుకార్లు వినిపించాయి. ఆమె విడాకులు ప్రకటించిన తర్వాత వీరిద్దరూ కలిసి దుబాయ్ వీధుల్లో కనిపించారు. ఈ ఏడాది జూన్‌లో జరిగిన పారిస్ ఫ్యాషన్ వీక్‌లో కూడా ఇద్దరూ కలిసి మెరిశారు. ఆ సమయంలోనే వీరికి నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎవరు ఈ షేకా మహ్రా?

షేకా మహ్రా, దుబాయ్ పాలకుడు, యూఏఈ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తె. ఆమె బ్రిటన్‌లో ఉన్నత విద్య అభ్యసించి అంతర్జాతీయ వ్యవహారాల్లో పట్టా పొందారు. మహిళా సాధికారత కోసం ఆమె కృషి చేస్తున్నారు. గతంలో ప్రముఖ వ్యాపారవేత్త షేక్ మనా బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్‌ను వివాహం చేసుకున్నారు. బిడ్డకు జన్మనిచ్చిన కొన్ని రోజులకే ఆమె తన భర్త నుంచి విడిపోయారు. ఆ సమయంలో ఆమె 'ఐ డివోర్స్ యూ' అంటూ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేసి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత 'డివోర్స్' అనే పేరుతో పర్‌ఫ్యూమ్ కూడా విడుదల చేశారు.

ఫ్రెంచ్ మోంటానా ఎవరు?

మొరాకో-అమెరికన్ అయిన ఫ్రెంచ్ మోంటానా ప్రపంచ ప్రఖ్యాత ర్యాపర్. 'అన్‌ఫర్‌గటబుల్', 'నో స్టైలిస్ట్' వంటి తన ఆల్బమ్స్‌తో ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. మోంటానా గతంలో వ్యాపారవేత్త నదీన్‌ను వివాహం చేసుకొని విడిపోయారు.

Tags

Next Story