Elon Musk : డోజ్ నుంచి మస్క్ ఔట్!

అమెరికా ప్రభుత్వంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. తన నిర్ణయాన్ని ఎక్స్ ప్రకటించారు. అమెరికా ప్రభుత్వంలో ప్రత్యేక గవర్నమెంట్ ఉద్యోగిగా తన షెడ్యూల్ ముగిసిందని ఈ ప్రకటనలో మస్క్ పేర్కొన్నారు. ప్రభుత్వంలో వృధా ఖర్చులు తగ్గించేందుకు తనకు అవకాశం కల్పించినందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపు ఆయన ధన్యవాదాలు తెలిపారు. డోజ్ మిషన్ భవిష్యత్లో మరింత బలపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ట్రంప్ రెండోసారి అధ్యక్షడుగా బాధ్యతలు తీసుకున్న తరువాత ఎలాన్ మస్క్ కు డోజ్ సారధిగా నియమించారు. ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు, ప్రభుత్వ శాఖల్లో వృధా ఖర్చులు తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా డోజ్ పని చేసింది. ఖర్చులు తగ్గించే పేరుతో ఎలాన్ మస్క్ వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల ను తొలగించారు. ఫలితంగా ప్రభుత్వంలో ఎలాన్ మస్క్ జోక్యం పట్ల తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీని ప్రభావం ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లాపై పడింది. దాని అమ్మకాలు అమెరికాలోనూ భారీగా తగ్గిపోయాయి. వీటికి తోడు ఇటీవల ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఒక బిల్లు ఉద్దేశ్యాలను మస్క్ తప్పుపట్టారు. ఈ బిల్లు మూలంగా అధిక బడ్జెట్ కేటాయించాల్సి ఉంటుందని, ప్రభుత్వ ఖర్చులు తగ్గించాలన్న డోజ్ లక్ష్యాలకు ఇది గండికొడుతుందని తొలిసారి మస్క్ తన నిరసన వ్యక్తం చేశారు. అయితే అమెరికా చట్టాల ప్రకారం ఏ వ్యక్తికీ వరుసగా 130 రోజులకు మించి ఈ హోదా ఇవ్వకూడదు. అది మే 30తో పూర్తవుతుంది. అందుకే మస్క్ వైదొలిగినట్లు ప్రకటించారు. డోజ్ మాత్రం కొనసాగుతుందని ట్రంప్ గతంలోనే ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com