US Penny Coin : అమెరికన్ కరెన్సీలో 232 ఏళ్ల చరిత్రకు ముగింపు..ఇకపై ఆ నాణెం ఉండదు.

US Penny Coin : అమెరికా డాలర్ల వ్యవస్థలో 232 ఏళ్లుగా కీలక పాత్ర పోషించిన ఈ పెన్నీ నాణెం ఇప్పుడు చరిత్రగా మారిపోనుంది. అమెరికా ప్రభుత్వం ఇకపై కొత్త పెన్నీ నాణేలను తయారు చేయకూడదని నిర్ణయించుకుంది. ఫిలడెల్ఫియాలో ఉన్న యూఎస్ మింట్ ఫ్యాక్టరీలో చివరి పెన్నీ నాణెం ఉత్పత్తి అయ్యింది. ఈ నిర్ణయంతో రెండున్నర శతాబ్దాల చరిత్ర ఉన్న ఒక నాణెం వ్యవస్థకు తెరపడింది. ఇకపై ఇవి కాయిన్ కలెక్టర్ల దగ్గర అరుదైన వస్తువులుగా మిగిలిపోతాయి
పెన్నీ తయారీని ఆపడానికి ప్రధాన కారణం డబ్బు ఆదా చేయడమే. ప్రస్తుతం ఒక పెన్నీ నాణేన్ని తయారు చేయడానికి దాని విలువ కన్నా నాలుగు రెట్లు ఎక్కువ ఖర్చు అవుతోందట. అంటే, ఒక్క పెన్నీ (1 సెంట్) నాణెం తయారు చేయడానికి దాదాపు 4 సెంట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో దానిని తయారు చేయడం వల్ల ప్రభుత్వానికి నష్టం వస్తుంది తప్ప, లాభం లేదు.
అందుకే ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ఈ తయారీని నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల సుమారు 56 మిలియన్ డాలర్లు పన్ను చెల్లింపుదారుల డబ్బు ఆదా అవుతుందని అమెరికా ఆర్థిక కార్యదర్శి బ్రాండన్ బీచ్ తెలిపారు. అంతేకాకుండా, ప్రజలు కూడా ఈ నాణేన్ని అంతగా ఉపయోగించడం లేదనే అభిప్రాయం ఉంది.
పెన్నీ అంటే ఎంత? అమెరికాలో ఉన్న ఇతర నాణేలు ఏవి?
మన దేశంలో ఒక రూపాయికి 100 పైసలు ఉన్నట్టే, అమెరికాలో ఒక డాలర్‌కు 100 సెంట్లు ఉంటాయి. ఈ సెంట్లను సూచించడానికి నాలుగు రకాల నాణేలు చలామణిలో ఉన్నాయి:
పెన్నీ : దీని విలువ 1 సెంట్. (మన 1 పైసాలాగా). 100 పెన్నీలు కలిపితే 1 డాలర్ అవుతుంది.
నికల్ : దీని విలువ 5 సెంట్లు. 20 నికల్స్ కలిపితే 1 డాలర్.
డైమ్ : దీని విలువ 10 సెంట్లు. 10 డైమ్‌లు కలిపితే 1 డాలర్.
క్వార్టర్ : దీని విలువ 25 సెంట్లు. 4 క్వార్టర్లు కలిపితే 1 డాలర్.
పెన్నీ నాణెం మాత్రమే రాగి రంగులో ఉంటుంది. మిగతా మూడు నాణేలు వెండి రంగులో ఉంటాయి.
ఇప్పటికే ఉన్న పెన్నీల పరిస్థితి ఏంటి?
కొత్త పెన్నీల తయారీ నిలిచిపోయినా, ఇప్పటికే చలామణిలో ఉన్న పెన్నీలు అలాగే ఉంటాయి. అంటే, వాటిని ప్రజలు యధావిధిగా వాడుకోవచ్చు. ప్రస్తుతం అమెరికాలో సుమారు 250 బిలియన్ (25 వేల కోట్లు) పెన్నీ నాణేలు చలామణిలో ఉన్నాయి. వీటి మొత్తం విలువ 250 కోట్ల డాలర్లుగా అంచనా వేస్తున్నారు. ఈ పెన్నీలు పూర్తిగా కరెన్సీ నుంచి బయటకు పోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

