Donald Trump : సారీ ట్రంప్.. ఫేస్ బుక్ క్షమాపణ
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ పై హత్యాయత్నం సమయంలో ఆయన పిడికిలి బిగించి ఉన్న ఫొటోను నకిలీగా గుర్తించడంపై ఫేస్ బుక్ క్షమాపణలు తెలిపింది. ఫ్యాక్ట్ చెక్ లో భాగంగా ట్రంప్ ఫొటోలను పరిశీలిస్తున్న సమయంలో ఒరిజినల్ ఫొటోను సిస్టమ్ ఫేక్ గా గుర్తించిందని ఫేస్బుక్ వెల్లడించింది. ఈ విషయంపై మెటా పబ్లిక్ అఫైర్స్ డైరెక్టర్ దాని లివర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
ట్రంప్ ఫొటోలను ఫ్యాక్ట్ చెక్ చేస్తున్న సమయంలో అతడి చుట్టూ ఉన్న రహస్య ఏజెంట్లు నవ్వుతున్నట్లుగా ఉన్న ఓ ఫొటోను ఫేక్ గా గుర్తించిన సిస్టమ్.. ఒరిజినల్ ఫొటోకు కూడా ఫేక్ అని తప్పుడు లేబులింగ్ ఇచ్చింది. సిస్టమ్ లో సాంకేతిక సమస్యల కారణంగా ఒక్కోసారి ఇలా జరుగుతుంది. పొరపాటును గుర్తించి సరిదిద్దుకున్నాం. క్షమాపణలు తెలియజేస్తున్నాం" అని దాని లివర్ రాసుకొచ్చారు.
ఇటీవల పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ పై ఓ దుండగుడు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో తనపై బుల్లెట్లు దూసుకొచ్చినా ఆయన భయపడలేదు. పైకి లేచి 'ఫైట్.. ఫైట్' అంటూ నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ట్రంప్ పిడికిలి బిగించి నినదిస్తున్న ఫొటోను అసోసియేటెడ్ ప్రెస్ ఫోటోగ్రాఫర్ ఇవాన్ వుక్సీ తీశారు. ఆ ఘటన తర్వాత ట్రంప్ విజయావకాశాలు భారీగా పెరిగినట్లు పోల్ స్టర్ తన నివేదికలో వెల్లడించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com