South Korea : దక్షిణ కొరియాలో కార్చిచ్చు.. 18 మంది మృతి

దక్షిణ కొరియాలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. దావానలం కారణంగా వేల సంఖ్యలో ఇళ్లు, చెట్లు కాలి బూడిదయ్యాయి. అనేక మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. మరోవైపు కార్చిచ్చుకు 18 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఆరుగురు తీవ్రంగా గాయపడగా.. మరో 13 మంది స్వల్పంగా గాయపడ్డారు. గతవారం సౌత్ కొరియా ఆగ్నేయ ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చు భారీ నష్టాన్ని కలిగించింది. బలమైన గాలులు, పొడి వాతావరణం వల్ల మంటలు కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. దీంతో వేల హెక్టార్ల విస్తీర్ణంలోని అడవులు బూడిదయ్యాయి. కార్చిచ్చులను అదుపుచేసేందుకు సైన్యం సాయంతో వేలాది మంది అగ్నిమాపక సిబ్బంది పనిచేస్తున్నారు. మరోవైపు పాఠశాలలను మూసివేశారు. వందలాది మంది ఖైదీలను జైళ్ల నుంచి ఇతర ప్రాంతాలకు తరలించారు. మంటల్లో వందల ఏళ్ల నాటి చారిత్రాత్మక ఆలయం పూర్తిగా కాలిబూడిదైపోయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com