Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో వరదల బీభత్సం..

ఆఫ్ఘనిస్థాన్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తూనే ఉన్నాయి. వరదల కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు అక్కడి మీడియా కథనాలు తెలుపుతున్నాయి. పశ్చిమ ఆఫ్ఘనిస్థాన్‌లోని ఘోర్ ప్రావిన్స్‌లో కుండపోత వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. ఈ వరదలలో సుమారు 68 మంది చనిపోగా.. పదుల సంఖ్యలో ప్రజలు వరదలో గల్లంతైనట్లు సమాచారం. ప్రాథమిక నివేదికల ఆధారంగా మృతుల సంఖ్య పెరుగుతున్నట్లు తాలిబన్ అధికారి ఒకరు శనివారం తెలిపారు. వరదల కారణంగా జిల్లా భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూసిందని.. వేల సంఖ్యలో ఇళ్లు, ఆస్తులు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. శుక్రవారం నాటి వరదలకు వందలాది ఎకరాల పొలం నాశనమైనట్లు అధికారులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా.. శుక్రవారం ఉత్తర ప్రావిన్స్‌లోని ఫర్యాబ్‌లో 18 మంది మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారని ప్రావిన్షియల్ గవర్నర్ అధికార ప్రతినిధి ఎస్మతుల్లా మొరాది తెలిపారు. మరోవైపు.. నాలుగు జిల్లాల్లో ఆస్తి, పంటలు దెబ్బతిన్నాయని, 300కు పైగా జంతువులు చనిపోయాయని చెప్పారు. గత వారం.. UN వరద ఏజెన్సీ ఆఫ్ఘనిస్తాన్‌లోని ఉత్తర ప్రావిన్స్ బాగ్లాన్‌లో ఊహించని భారీ వర్షాలకు వేలాది గృహాలు దెబ్బతిన్నాయని తెలిపింది. ఘోర వరదల వల్ల 2500 కుటుంబాలు దెబ్బతిన్నాయి. మే 10 నుంచి ప్రావిన్స్ వరదలతో అతలాకుతలమవుతుంది. మరోవైపు.. వరద బాధిత ప్రజలకు నివసించడానికి ఇళ్లు లేవని ప్రపంచ ఆహార సంస్థ తెలిపింది. ఏప్రిల్‌లో ఆఫ్ఘనిస్తాన్‌లో సంభవించిన వినాశకరమైన వరదల కారణంగా 70 మంది మరణించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com