Australia: గొడవ పడద్దని చెప్పినందుకే చంపేశారు

ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో హర్యానాలోని కర్నాల్‌కు చెందిన 22 ఏళ్ల నవజీత్ సంధూ ప్రాణాలు కోల్పోయాడు. అద్దె విషయంలో జరిగిన గొడవలో హత్యకు గురయ్యాడు. ఈ ఘటనతో సంధూ తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అయితే ఈ హత్య తర్వాత పరారీలో ఉన్న ఇద్దరు సోదరులను పోలీసులు అరెస్ట్ చేశారు.
కర్నాల్ ప్రాంతానికి చెందిన నవజీత్ సంధూ 2022 నవంబర్‌లో స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియాకు వెళ్లి మెల్‌బోర్న్ సిటీలో చదువుకుంటున్నాడు. హర్యానా రాష్ట్రానికి చెందిన ఇద్దరు సోదరుల మధ్య జరిగిన గొడవ కారణంగా తన కొడుకు ప్రాణాల మీదికి తెచ్చిందని నవజీత్ తండ్రి జితేందర్ సంధూ వాపోయాడు. తమకు ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో నవజీత్ మిత్రులు ఫోన్ చేశారని, నవజీత్ మరణించాడని చెప్పారని అన్నారు. సహచర విద్యార్థులు గొడవపడుతుండగా అడ్డుకోబోయిన తన కొడుకును చంపేశారని విలపించారు.
శ్రావణ్‌కుమార్ అనే విద్యార్థి తన రూమ్మేట్స్‌తో గొడవపడి నవజీత్ ఫ్లాట్‌కు వెళ్లాడు. జరిగిన విషయాన్ని నవజీత్ సంధూతో పంచుకున్నాడు. అనంతరం అతడు రూమ్మేట్‌కు ఫోన్ చేసి బయటికి రావాలని డిమాండ్ చేశాడు. దీంతో శ్రావణ్ తనకు తోడుగా రమ్మనడంతో నవజీత్ వెళ్లాడు. గదిలో శ్రావణ్.. రూమ్మేట్‌తో గొడవ పడడం.. పెద్ద పెద్దగా అరుపులు వినబడడంతో నవజీత్ లోపలికి వెళ్లాడు. శ్రావణ్‌పై కత్తితో దాడి చేస్తున్న వాళ్లను అడ్డుకునేందుకు ప్రయత్నించగా నవజీత్ కత్తిపోట్లకు గురయ్యాడు. అక్కడికక్కడే నవజీత్ ప్రాణాలు వదిలాడు. శ్రావణ్ మాత్రం కోలుకుంటున్నాడు.
నవజీత్‌ను పొడిచిన అనంతరం పరారీలో ఉన్న ఇద్దరు నిందితులు అభిజీత్, రాబిన్ గోర్టాన్ ను ఎట్టకేలకు మెల్‌బోర్న్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా తన కొడుకు మృతదేహాన్ని సాధ్యమైనంత తొందరగా భారత్‌కు రప్పించాలని జితేందర్ సంధూ భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com