Nepal Floods : నేపాల్‌లో భారీ వర్షాలు.. బిహార్‌లో వరద బీభత్సం

Nepal Floods : నేపాల్‌లో భారీ వర్షాలు.. బిహార్‌లో వరద బీభత్సం
X

నేపాల్‌లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం బిహార్‌పై పడింది. ఇప్పటికే వరదలు బిహార్‌కు చేరడంతో రాష్ట్రంలోని 12 జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. దర్భంగా, సీతామర్హి జిల్లాల్లోని కోసి, బాగ్మతి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కోసి నది వరద ధాటికి కర్తార్ పూర్ బ్లాక్ సమీపంలో దాని ఆనకట్ట తెగినట్టు అధికారులు తెలిపారు. దీంతో పలు గ్రామాలు నీట మునిగాయి. అయితే పరిస్థితి అదుపులోనే ఉందని, ఎలాంటి భయాందోళన అవసరం లేదని వెల్లడించారు. ‘రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సోమవారం వరకు ఆరు కట్టలు తెగిపోయాయి. వాటిలో కొన్నింటికి మరమ్మతులు చేయగా, మరికొన్నింటి పనులు జరుగుతున్నాయి’ అని బిహార్ జలవనరుల శాఖ మంత్రి విజయ్ కుమార్ చౌదరి తెలిపారు. వరదల కారణంగా రాష్ట్రంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నారు.రాష్ట్రంలో వరదల వల్ల 16 లక్షల మంది ప్రభావితమైనట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ముజఫర్‌పూర్‌లోని కత్రా బకుచి పవర్ గ్రిడ్‌లోకి కూడా వరదనీరు చేరి 45,000 ఇండ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వరదల నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని రాష్ట్రంలో మోహరించారు. పలు నదుల్లో నీటిమట్టం పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం వరదల హెచ్చరికలు జారీ చేసింది. అలాగే భారత వాతావరణ శాఖ బిహార్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మరోవైపు నేపాల్‌లో భారీ వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య 200కు చేరుకుంది.

Tags

Next Story