America : అమెరికాలో ఆలయ గోడలపై హిందూ వ్యతిరేక నినాదాలు
అమెరికాలోని ఓ ఆలయం గోడలపై కొందరు వ్యక్తులు హిందూ వ్యతిరేక నినాదాలు(గ్రాఫిటీ) రాశారు. కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలోని బాప్స్ శ్రీ స్వామినారాయణ మందిరంపై ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. అభ్యంతరకర వ్యాఖ్యలు రాశారని ఆలయ అధికారులు వెల్లడించారు. అలాగే అక్కడికి వెళ్లే నీటి పైపులను సైతం ధ్వంసం చేశారు. శాంతి కోసం ప్రార్థనలతో ఇలాంటి విద్వేషాన్ని ఎదుర్కొంటామని తెలిపారు. గత పది రోజుల వ్యవధిలో ఈ తరహా ఘటన చోటుచేసుకోవడం ఇది రెండోసారి. దీనికిముందు న్యూయార్క్‌లోని బాప్స్ మందిరం వద్ద దుండగులు ఇదేవిధంగా ప్రవర్తించారు. దీనిపై తాము దర్యాప్తు చేస్తున్నామని శాక్రమెంటో పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన నేపథ్యంలో హిందూ వర్గానికి చెందినవారంతా ఆలయం వద్దకు చేరుకొని, ప్రార్థనల్లో పాల్గొన్నారు. శాంతి, ఐక్యత కోసం ప్రార్థించారు. శాక్రమెంటో కౌంటీకి ప్రాతినిధ్యం వహిస్తోన్న హిందూ అమెరికన్ చట్టసభ్యుడు అమిబెరా.. ఈ దుశ్యర్యను ఖండించారు. మత విద్వేషానికి తావులేదని వ్యాఖ్యానించారు. మరో కాంగ్రెస్ సభ్యుడు, ఇండియన్ అమెరికన్ రో ఖన్నా మాట్లాడుతూ.. ఇలాంటి చర్యలు నైతికంగా తప్పని అన్నారు. చట్టప్రకారం బాధ్యులను జవాబుదారీ చేయాలని దర్యాప్తు అధికారులకు సూచించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com