Sheikh Hasina : త్వరలో బంగ్లాకు తిరిగొస్తా: షేక్ హసీనా

భారత్‌లో తలదాచుకుంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో బంగ్లాకు తిరిగివస్తానని, అవామీ లీగ్ శ్రేణులు ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. సోషల్ మీడియాలో వారితో మాట్లాడుతూ బంగ్లా చీఫ్ అడ్వైజర్ యూనస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు ప్రజలంటే ప్రేమ లేదన్నారు. అధిక వడ్డీలకు రుణాలిచ్చి విదేశాల్లో విలాసవంతంగా బతికారన్నారు. ఆయన అధికార వాంఛ బంగ్లాను తగలబెడుతోందని దుయ్యబట్టారు.
‘‘యూనస్ వల్ల దేశ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. అతడికి అధికారంపై వ్యామోహం మాత్రమే ఉంది. వారి సారథ్యంలో బంగ్లా ప్రస్తుతం ఉగ్రవాద దేశంగా మారింది. మన నాయకులు, కార్యకర్తలను దారుణంగా హత్య చేశారు. పోలీసులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, కళాకారులు ఇలా ఎంతోమందిని లక్ష్యంగా చేసుకున్నారు. ప్రస్తుతం దేశంలో ఎన్నో అత్యాచారాలు, హత్యలు, దొంగతనాలు జరుగుతున్నాయి. కానీ, మీడియాకు చెందిన వ్యక్తులను కూడా లక్ష్యంగా చేసుకుంటారనే భయంతో ఈ నేరాలు బయటకు రావడం లేదు’’ అని తాత్కాలిక ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com