Israel – Hamas War : దాడుల వీడియోలు రిలీజ్ చేసిన హమాస్

అక్టోబర్ 7నాటి నోవా మ్యూజిక్ ఫెస్టివల్‌లో హమాస్ దాడుల్లో ధ్వంసమైన కార్ల వీడియోను ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది. ఇజ్రాయెల్ వ్యాప్తంగా సామూహిక హత్యలకు సాక్షీభూతాలుగా నిలిచిన వందలాది వాహనాలను సైన్యం.. ఓ చోట చేర్చింది. ఈ కార్లలో తమవారికి చెందిన వస్తువులు ఏమైనా దొరుకుతాయా అని ఇజ్రాయెల్ ప్రజలు గాలిస్తున్నారు.
అక్టోబర్ 7న.. ఇజ్రాయెల్‌లోని కిబ్బట్జ్ బీరీలో జరిగిన నోవా సంగీత కచేరీలో ధ్వంసమైన కార్లను ఇజ్రాయెల్ సైన్యం ఒక చోట చేర్చింది. కిబ్బజ్ట్ బీరీతోపాటు ఇతర ప్రాంతాల్లో హమాస్ మిలిటెంట్లు ధ్వంసం చేసిన వాహనాలు అన్నిటినీ అదేచోట పేర్చింది. ఇక్కడ కనిపిస్తున్న వాహనాల్లో కొన్ని పాక్షికంగా ధ్వంసం కాగా.. మరికొన్ని పూర్తిగా ఆనవాళ్లు లేకుండా పోయాయి. ఆ వాహనాలను ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు.
ఈ వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లను వెతికేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. దాడి ఎలా జరిగిందన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. బూడిదైన కార్లలో మానవ అవశేషాలు ఏమైనా లభిస్తాయా అని వెతుకుతున్నారు. పూర్తిగా గల్లంతైన తమ కుటుంబీకులు, స్నేహితుల అవశేషాల కోసం ఇజ్రాయెల్ ప్రజలు గాలిస్తున్నారు. వాటితో సంప్రదాయంగా అంత్యక్రియలు నిర్వహించాలని కోరుకుంటున్నారు.
అక్టోబర్ 7న శబ్బత్ పండుగ సందర్భంగా వందలాదిమంది ఇజ్రాయెల్ పౌరులు కిబ్బట్జ్‌బీరీ ప్రాంతంలో వేడుకలు నిర్వహించుకున్నారు. అదే సమయంలో ఓ వైపు వేలాది రాకెట్లను ప్రయోగిస్తూనే మరోవైపు.. నోవా మ్యూజిక్ ఫెస్టివల్‌పై హమాస్ మిలిటెంట్లు దాడి చేశారు. ట్యాంకర్లు, మిషిన్ గన్‌లతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ క్రమంలో వందల మంది మరణించారు. చాలామంది ఈ కార్లలో చనిపోయినవారిగా నటించి ప్రాణాలు కాపాడుకున్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com