Pakistan: పాక్‌కిస్తాన్ ను ముంచెత్తుతున్న వర్షాలు..

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌తో భారత్ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సింధు జలాలను భారత్ నిలిపివేసింది. అంతేకాకుండా ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయి.
ఇలాంటి తరుణంలో దయాది దేశం పాకిస్థాన్‌కు భారత్ కీలక అలర్ట్ జారీ చేసింది. తావి నదిలో వరదలు వచ్చే అవకాశం ఉందని భారత్ సూచించినట్లుగా పాకిస్థాన్‌కు చెందిన ది న్యూస్ మీడియా సంస్థ తెలిపింది. వరదలు వచ్చే అవకాశం ఉందని.. అప్రమత్తంగా ఉండాలని పాకిస్థాన్‌ను భారత్ సంప్రదించినట్లుగా మీడియా పేర్కొంది. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ ఆదివారం ఈ హెచ్చరికను తెలియజేసిందని ఆ పత్రిక తెలిపింది.
ఇక భారతదేశం అందించిన సమాచారం ఆధారంగా పాకిస్థాన్ అధికారులు హెచ్చరికలు జారీ చేసినట్లుగా పేర్కొంది. ఆగస్టు 30 వరకు పాకిస్థాన్‌లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) హెచ్చరించింది. ఇక భారీ వర్షాలు కారణంగా శనివారం నాటికి 788 మంది చనిపోయారని.. 1,018 మందికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. లాహోర్, రావల్పిండి, గుజ్రాన్‌వాలా వంటి ప్రధాన నగరాల్లోనూ వరద నీరు ఇళ్లు, దుకాణాల్లోకి చేరి జనజీవనం స్తంభించింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో వాహనాలు నీటిలో చిక్కుకుపోయాయి. దేశవ్యాప్తంగా సహాయక బృందాలు రంగంలోకి దిగి ఇప్పటివరకు 512 ఆపరేషన్ల ద్వారా సుమారు 25,644 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. వర్షాలు ఇప్పట్లో తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించకపోవడంతో నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com