JD Vance: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత పై అమెరికా ఉపాధ్యక్షుడు ఆసక్తికర వ్యాఖ్యలు

భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో అమెరికా నుంచి కీలక ప్రకటన వెలువడింది. యుద్ధంలో తాము జోక్యం చేసుకోబోమని, ప్రాథమికంగా దాంతో తమకు ఎటువంటి సంబంధం లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గురువారం విస్పష్టంగా ప్రకటించారు. ‘భారత్, పాకిస్థాన్‌ను అమెరికా కట్టడి చేయలేదు. ఉద్రిక్తతలను తగ్గించాలని మాత్రమే ఆ రెండు అణ్వస్త్ర దేశాలకు మేము సూచించగలం’ అని ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. భారత్, పాకిస్థాన్ మధ్య అణు యుద్ధం జరిగే అవకాశాలపై ట్రంప్ ప్రభుత్వం ఏ రకంగా ఆందోళన చెందుతోందన్న ప్రశ్నకు అణ్వస్ర్తాలు కలిగిన రెండు దేశాలు ఘర్షణకు దిగితే అది భారీ యుద్ధానికి దారితీయగలదన్న ఆందోళన ఉందని వాన్స్ చెప్పారు. సాధ్యమైనంత త్వరితంగా ఉద్రిక్తతలు తగ్గాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పిన మాటలను ఆయన ఉటంకించారు. భారత్‌కు పాకిస్థాన్‌తో విరోధం ఉందని, అందుకు పాక్ జవాబిచ్చిందని ఆయన చెప్పారు. ఈ సమయంలో ఉద్రిక్తతలను కాస్త తగ్గించుకోవాలని మాత్రమే తాము చెప్పగలమని ఆయన తెలిపారు.
భారతీయులకు చెప్పలేం
ఆయుధాలను పక్కనపెట్టమని భారతీయులకు అమెరికా చెప్పలేదని వాన్స్ తెలిపారు. పాకిస్థాన్‌కు కూడా ఆయుధాలు పక్కనపెట్టాలని తాము చెప్పలేమన్నారు. ఈ విషయాన్ని దౌత్యపరమైన మార్గాల ద్వారా మాత్రమే తాము కొనసాగిస్తామని ఆయన అన్నారు.‘ ఇది విస్తృతమై ప్రాంతీయ యుద్ధానికి లేదా అణు యుద్ధానికి దారితీయకూడదని మాత్రమే మేము ఆశిస్తున్నాము, అంచనా వేస్తున్నాము’ అని వాన్స్ తెలిపారు. అణుయుద్ధం జరిగితే అది వినాశనానికి దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. ఆ పరిస్థితి వస్తుందని ప్రస్తుతానికైతే తాము భావించడం లేదని వాన్స్ అభిప్రాయపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com