Arunachal Pradesh: షాంఘై ఎయిర్‌పోర్టులో మహిళపై చైనా అధికారుల వేధింపులు

Arunachal Pradesh: షాంఘై ఎయిర్‌పోర్టులో  మహిళపై చైనా అధికారుల వేధింపులు
X
"అరుణాచల్ చైనాదే" అంటూ మహిళను గంటలపాటు నిర్బంధం

అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన భారత సంతతి మహిళను షాంఘై విమానాశ్రయంలో చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు అక్రమంగా నిర్బంధించి, వేధించిన ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ బీజింగ్, ఢిల్లీలలోని చైనా అధికారుల వద్ద బలమైన నిరసన నమోదు చేసింది.

వివరాల్లోకి వెళితే, అరుణాచల్ ప్రదేశ్‌లో జన్మించిన ప్రేమ వాంగ్‌జోమ్ థోంగ్‌డోక్ అనే యూకే నివాసి నవంబర్ 21న లండన్ నుంచి జపాన్‌కు ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో మూడు గంటల లేఓవర్ కోసం షాంఘై పుడాంగ్ విమానాశ్రయంలో ఆగారు. అయితే, ఆమె పాస్‌పోర్ట్‌పై జన్మస్థలం 'అరుణాచల్ ప్రదేశ్' అని ఉండటంతో చైనా అధికారులు దానిని "చెల్లదు" అని ప్రకటించారు. "అరుణాచల్ ప్రదేశ్ చైనాలో అంతర్భాగం" అని వాదిస్తూ ఆమెను దాదాపు 18 గంటల పాటు నిర్బంధించి వేధించారు.

ఈ ఘటన జరిగిన రోజే భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. షాంఘైలోని భారత కాన్సులేట్ కార్యాలయం వెంటనే రంగంలోకి దిగి బాధితురాలికి పూర్తి సహాయం అందించింది. "ఒక భారత ప్రయాణికురాలిని అర్థంలేని కారణాలతో నిర్బంధించడం దారుణం. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో విడదీయలేని భాగం. అక్కడి పౌరులకు భారత పాస్‌పోర్ట్‌తో ప్రయాణించే పూర్తి హక్కు ఉంది. చైనా చర్యలు అంతర్జాతీయ పౌర విమానయాన ఒప్పందాలకు విరుద్ధం," అని ఓ సీనియర్ అధికారి స్పష్టం చేశారు.

చైనా అధికారులు, చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది తనను చూసి నవ్వారని, "చైనా పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకో" అంటూ ఎగతాళి చేశారని థోంగ్‌డోక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీటీవీ కథనం ప్రకారం, ఆ సమయంలో ఆమెకు సరైన ఆహారం, ప్రాథమిక సౌకర్యాలు కూడా కల్పించలేదని తెలిసింది. ఆమె పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకుని, జపాన్‌కు వెళ్లాల్సిన విమానం ఎక్కకుండా అడ్డుకున్నారు. యూకేలోని తన స్నేహితురాలి ద్వారా షాంఘైలోని భారత కాన్సులేట్‌ను సంప్రదించడంతో, అధికారులు జోక్యం చేసుకుని ఆమెను మరో విమానంలో పంపించారు.

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన థోంగ్‌డోక్, ఇది భారతదేశ సార్వభౌమత్వానికి అవమానమని పేర్కొన్నారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, నష్టపరిహారం ఇప్పించాలని, భవిష్యత్తులో అరుణాచల్ ప్రదేశ్ వాసులకు ఇలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.

Tags

Next Story