హర్మూజ్‌ జలసంధి దాటిన భారత్‌ ఎల్పీజీ నౌకలు.. ఇంధన సరఫరాపై ఊరట

హర్మూజ్‌ జలసంధి దాటిన భారత్‌ ఎల్పీజీ నౌకలు.. ఇంధన సరఫరాపై ఊరట
X
ఒక నౌక గుజరాత్‌లోని కాండ్లాకు.. మరొకటి మంగళూరుకు ప్రయాణం

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య భారత్‌కు వంటగ్యాస్‌ సరఫరాపై కీలక పరిణామం చోటుచేసుకుంది. పర్షియన్‌ గల్ఫ్‌ నుంచి భారత్‌కు బయలుదేరిన రెండు ఎల్పీజీ నౌకలు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధిని విజయవంతంగా దాటినట్లు సమాచారం. దీంతో ప్రపంచ ఇంధన రవాణాలో మళ్లీ క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

అధికార వర్గాల ప్రకారం, యూఏఈలోని రువాయిస్‌ రిఫైనరీ నుంచి బయలుదేరిన ‘ఎంవీ సన్‌షైన్‌’ అనే ఎల్పీజీ నౌక హర్మూజ్‌ జలసంధిని దాటి సురక్షితంగా ముందుకు సాగుతోంది. ఈ నౌక కర్ణాటకలోని మంగళూరు పోర్టుకు చేరనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఖతార్‌లోని రాస్‌ లఫాన్‌ పోర్టు నుంచి గుజరాత్‌లోని కాండ్లాకు బయలుదేరిన ‘సిమి’ అనే మరో ఎల్పీజీ నౌక కూడా ఒమన్‌ గల్ఫ్‌లోకి ప్రవేశించింది. ప్రయాణ భద్రత దృష్ట్యా ఈ రెండు నౌకలు కొంతసేపు తమ ట్రాన్స్‌పాండర్‌ సిగ్నల్స్‌ను నిలిపివేసినట్లు సమాచారం.

ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పర్షియన్‌ గల్ఫ్‌ నుంచి ఇప్పటివరకు 15 ఎల్పీజీ నౌకలను సురక్షితంగా భారత్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నౌకల భద్రత కోసం భారత నౌకాదళంతో పాటు పలు ఏజెన్సీలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. అయితే ఈ నౌకల్లో ఎంత పరిమాణంలో ఎల్పీజీ ఉందన్నది, అవి భారత్‌కు ఎప్పుడు చేరుకుంటాయన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

ఇదిలా ఉండగా, హర్మూజ్‌ జలసంధిలో పరిస్థితులు త్వరలో మెరుగుపడతాయని ఇరాన్‌ న్యాయ, అంతర్జాతీయ వ్యవహారాల ఉపవిదేశాంగ మంత్రి కాజమ్‌ ఘరీబబాదీ తెలిపారు. తాము అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడం లేదని, శాంతి నెలకొన్న తర్వాత ఈ ప్రాంతంలో భద్రత మరింత బలపడుతుందని పేర్కొన్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం ఇరాన్‌తో కాల్పుల విరమణ ప్రయత్నాలు ఇంకా అనిశ్చితిలోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. అమెరికా ప్రతిపాదించిన శాంతి ఒప్పందంపై ఇరాన్‌ స్పందన పూర్తిగా ఆమోదయోగ్యం కాదని ఆయన ‘ట్రూత్‌ సోషల్‌’ వేదికగా తెలిపారు.

ప్రపంచ ముడిచమురు, ఎల్‌ఎన్‌జీ మరియు ఎల్పీజీ రవాణాలో హర్మూజ్‌ జలసంధి కీలక మార్గం. ముఖ్యంగా భారత్‌ వంటి ఇంధన దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఈ మార్గం అత్యంత ప్రాధాన్యమైనది. ఈ నేపథ్యంలో భారత నౌకలు సురక్షితంగా జలసంధిని దాటడం దేశ ఇంధన భద్రతకు ఊరటనిచ్చే అంశంగా భావిస్తున్నారు.

Tags

Next Story