Russia Oil : అమెరికా మనసు మారింది.. రష్యా నుంచి ఆయిల్ కొనడానికి మోదీ సర్కార్‌కు అనుమతి.

Russia Oil : మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు బ్రేకులు పడ్డాయి. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న దాడుల వల్ల సముద్ర మార్గాలన్నీ మూతపడ్డాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో భారత్‌కు అమెరికా నుంచి ఒక ఊరట లభించింది. రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేసేందుకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, భారతీయ రిఫైనర్లు ఏకంగా 30 మిలియన్ బారెళ్ల రష్యన్ ఆయిల్ కొనుగోలు చేసినట్లు సమాచారం. దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత రాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కీలక అడుగు వేసింది.
సాధారణంగా భారత్ తన చమురు అవసరాల కోసం సౌదీ అరేబియా, ఇరాక్ వంటి దేశాలపై ఆధారపడుతుంది. అయితే, ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడులు మొదలైనప్పటి నుంచి హోర్ముజ్ జలసంధి దాదాపుగా మూతపడింది. ప్రపంచ చమురు రవాణాలో ఇది కీలక మార్గం. ఈ రూట్ బంద్ కావడంతో మిడిల్ ఈస్ట్ నుంచి రావాల్సిన చమురు నౌకలు నిలిచిపోయాయి. దీంతో భారత్ తన పాత మిత్రదేశమైన రష్యా వైపు చూడక తప్పలేదు. గతంలో ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా నుంచి చమురు కొనవద్దని అమెరికా ఒత్తిడి చేసినప్పటికీ, ప్రస్తుత గడ్డు పరిస్థితుల్లో ట్రంప్ సర్కార్ భారత్‌కు ప్రత్యేక మినహాయింపులు ఇచ్చింది.
అమెరికా నుంచి అనుమతి రాగానే భారతీయ చమురు దిగ్గజ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ రంగంలోకి దిగాయి. స్పాట్ మార్కెట్‌లో అమ్ముడుపోకుండా ఉన్న రష్యన్ క్రూడ్ ఆయిల్ మొత్తాన్ని ఈ రెండు కంపెనీలు కొనేశాయి. సుమారు 10 మిలియన్ బారెళ్లను ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కొనగా, రిలయన్స్ కూడా అదే స్థాయిలో ఆర్డర్ పెట్టింది. యురల్స్, ESPO వంటి రష్యన్ చమురు గ్రేడ్‌లు ప్రస్తుతం లండన్ బ్రెంట్ బెంచ్‌మార్క్ కంటే 2 నుంచి 8 డాలర్ల అదనపు ధర పలుకుతున్నా, సరఫరా గ్యారెంటీ ఉండటంతో భారత్ ఈ డీల్ ఓకే చేసింది.
అమెరికా ఇచ్చిన వెసులుబాటు ప్రకారం మార్చి 5 కంటే ముందు లోడ్ అయిన రష్యన్ చమురును భారతీయ కంపెనీలు కొనుగోలు చేయవచ్చు. ఈ ప్రకటన రాగానే అప్పటికే సముద్రంలో ఉండి, సింగపూర్ వైపు వెళ్తున్న మెలో, సారా వంటి భారీ చమురు ట్యాంకర్లు తమ దిశను మార్చుకుని భారత్ వైపు ప్రయాణాన్ని మొదలుపెట్టాయి. 2024 మధ్యలో భారత్ రోజుకు 2 మిలియన్ బారెళ్ల రష్యన్ చమురును కొనేది, కానీ ఒత్తిళ్ల వల్ల అది ఫిబ్రవరి నాటికి 1.06 మిలియన్ బారెళ్లకు పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ రష్యా ఆయిల్ భారత్ గడ్డపైకి భారీగా చేరుతుండటంతో ఇంధన సంక్షోభం తప్పుతుందని నిపుణులు భావిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
