India-Canada Trade : భారత్-కెనడా దోస్తీ షురూ.. 2030 నాటికి 50 బిలియన్ డాలర్ల ట్రేడ్ టార్గెట్.

India-Canada Trade : భారత్-కెనడా దోస్తీ షురూ.. 2030 నాటికి 50 బిలియన్ డాలర్ల ట్రేడ్ టార్గెట్.
X

India-Canada Trade : భారత్, కెనడా దేశాల మధ్య సంబంధాల్లో ఒక కొత్త శకం మొదలైంది. సోమవారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, కెనడా ప్రధాని మార్క్ కార్నీ మధ్య జరిగిన కీలక చర్చలు ఇరు దేశాల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడమే కాకుండా, భవిష్యత్తు సహకారానికి బలమైన పునాది వేశాయి. ముఖ్యంగా రక్షణ, ఇంధనం, సాంకేతిక రంగాల్లో కీలక ఒప్పందాలు జరిగాయి. 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఏకంగా 50 బిలియన్ డాలర్లకు పెంచడమే లక్ష్యంగా ప్రధాని మోదీ ప్రకటించారు.

ఈ భేటీలో అత్యంత కీలకమైన అంశం ఇండియా-కెనడా డిఫెన్స్ డయలాగ్ ప్రారంభం కావడం. రక్షణ, భద్రతా రంగాల్లో పెరుగుతున్న ఈ సహకారం ఇరు దేశాల మధ్య ఉన్న ప్రగాఢ విశ్వాసానికి ప్రతీక అని మోదీ పేర్కొన్నారు. రక్షణ పరిశ్రమలు, సముద్ర మార్గాల్లో నిఘా, సైనిక మార్పిడి వంటి అంశాల్లో కలిసి పనిచేయాలని ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నారు. అలాగే, భారత్ విద్యుత్ అవసరాల కోసం కెనడా నుంచి దీర్ఘకాలిక యురేనియం సరఫరా ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నారు. ఇది భారత అణు ఇంధన రంగానికి పెద్ద ఊరటనిస్తుంది.

ఇంధన రంగంలో కూడా భారత్-కెనడా మధ్య కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యం కుదిరింది. ఎల్‌ఎన్‌జీ, ఎల్‌పీజీ, యురేనియం మాత్రమే కాకుండా సోలార్ మరియు హైడ్రోజన్ వంటి పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించడానికి మూడు కీలక ఒప్పందాల పై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, కెనడా విదేశాంగ మంత్రి అనిత ఆనంద్ సంతకాలు చేశారు. వీటితో పాటు క్రిటికల్ మినరల్స్, కల్చరల్ కోఆపరేషన్ వంటి రంగాల్లో కూడా పరస్పర సహకారానికి మార్గం సుగమమైంది. రైతుల ప్రయోజనాల కోసం భారత్‌లో ఇండియా-కెనడా పల్స్ ప్రోటీన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు మోదీ ప్రకటించారు.

ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలపై కూడా ప్రధాని మోదీ స్పందించారు. అక్కడ జరుగుతున్న యుద్ధ వాతావరణం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రపంచంలోని రెండు పెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి నిలబడితే శాంతి స్వరం మరింత బలంగా వినిపిస్తుందని ఆయన అన్నారు. అక్కడ ఉన్న భారతీయ పౌరుల భద్రత కోసం అన్ని దేశాలతో కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారు.

కెనడా ప్రధాని మార్క్ కార్నీ పర్యటన ఇరు దేశాల భాగస్వామ్యానికి కొత్త జవజీవాలను అందించిందని మోదీ కొనియాడారు. ఇరు దేశాల మధ్య ఉన్న ప్రజలే ఈ సంబంధాలకు అసలైన బలమని, వారి మధ్య అనుబంధాన్ని మరింత పెంచడానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కెనడా కూడా ఒక పసిఫిక్ దేశమని, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో బలమైన సంబంధాలు తమ దేశ సార్వభౌమాధికారానికి ఎంతో ముఖ్యమని కెనడా ప్రధాని కార్యాలయం పేర్కొంది.

Tags

Next Story