India: తూర్పు లడఖ్‌లో భారత్, చైనా బలగాల ఉపసంహరణ పూర్తి అయినట్టే?
తూర్పు లడఖ్‌లోని ఎల్ఏసీ వెంబడి గత నాలుగేళ్లుగా నెలకొన్న సైనిక ప్రతిష్ఠంభనకు ముగింపు పలుకుతూ భారత్-చైనాల మధ్య గతవారం కీలక ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ అంగీకారం ప్రకారం మూడు రోజుల క్రితం మొదలైన బలగాల ఉపసంహరణ ప్రక్రియ దాదాపు పూర్తయిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. తూర్పు లడఖ్ సెక్టార్‌లోని దెప్సాంగ్, డెమ్‌చోక్ ప్రాంతాలలో బలగాలు వెనక్కి మళ్లే ప్రక్రియ ముగిసినట్టేనని పేర్కొన్నాయి. భారత్, చైనా సైన్యాలు ఒకరి స్థావరాలను మరొకరు పరస్పరం తనిఖీ చేసుకుంటున్నాయని, మౌలిక సదుపాయాల తొలగింపులను కూడా ధృవీకరించుకుంటున్నాయని జాతీయ మీడియా పేర్కొంది.
కాగా తూర్పు లడఖ్‌లోని ఎల్ఏసీ వెంబడి పెట్రోలింగ్, దళాల ఉపసంహరణకు భారత్ చైనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీంతో గాల్వాన్ లోయలో ఇరు సేనల మధ్య తీవ్ర ఘర్షణ తర్వాత నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగిపోయింది. ఈ ఒప్పందానికి ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లు ఆమోదం తెలిపారు. రష్యా వేదికగా జరిగిన ద్వైపాక్షిక భేటీలో ఇరువురూ హర్షం వ్యక్తం చేశారు.
2020 జూన్ 15న తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. చైనా కూడా భారీగా సైనికులను కోల్పోయింది. ఘర్షణల నేపథ్యంలో ఇరు దేశాలు ఎల్‌ఏసీ వెంబడి భారీ స్థాయిలో బలగాలను మోహరించాయి. అప్పటినుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే గస్తీ ఒప్పందం కుదుర్చుకున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com