Nepal: నేపాల్‌లో సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేత

నేపాల్‌లో ఇటీవల సామాజిక మాధ్యమాలపై విధించిన నిషేధం తీవ్ర ఆందోళనలు, హింసాత్మక ఘటనలకు దారితీయడంతో ప్రభుత్వం అత్యవసరంగా నిర్ణయం మార్చుకుంది. సోమవారం అర్ధరాత్రి తర్వాత నేపాల్ ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలో సోమవారం రాత్రి జరిగిన అత్యవసర క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం, సమాచార, ప్రసార శాఖ మంత్రి పృథ్వీ సుబా గురుంగ్ మీడియాతో మాట్లాడుతూ, "సామాజిక మాధ్యమాలపై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం అధికారికంగా ఎత్తివేస్తోంది. మళ్లీ ఈ మాధ్యమాలు సాధారణంగా పనిచేయనున్నారు" అని ప్రకటించారు.
అసలు నిషేధం ఎందుకు వచ్చిందంటే?
గడువు లోపు ఫేస్‌బుక్, వాట్సప్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విటర్), రెడిట్, లింక్డిన్ వంటి 26 సామాజిక మాధ్యమాలు నేపాల్ కమ్యూనికేషన్ శాఖలో రిజిస్టర్ అవ్వకపోవడంతో, గత గురువారం నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించింది.ఈ చర్యపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో ఖాట్మండు సహా పలు పట్టణాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు ప్రారంభమయ్యాయి. నిరసనకారులు పార్లమెంట్ వైపు దూసుకెళ్లారు.nభద్రతా బలగాలు ఆందోళనకారులను అడ్డుకునేందుకు జలఫిరంగులు, టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు ఉపయోగించాయి. ఈ ఘటనల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు, 300 మందికి పైగా గాయపడ్డారు.
ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేయడంతో సోమవారం అర్ధరాత్రి దాటాక ఫేస్‌బుక్, ఎక్స్, వాట్సప్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాలు మళ్లీ నెట్‌వర్క్‌లోకి వచ్చాయి. ప్రజల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని, సమాచార మంత్రిత్వ శాఖ సంబంధిత ఏజెన్సీలతో సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి గురుంగ్ తెలిపారు.
"ప్రభుత్వం ప్రజల భావోద్వేగాలను గౌరవిస్తోంది. అందుకే నిషేధాన్ని ఎత్తివేస్తున్నాం. ప్రజలు ఇక ఆందోళనలు విరమించాలి," అని మంత్రి పృథ్వీ సుబా గురుంగ్ కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com