భారత్- పాక్ కీలక నిర్ణయం

నియంత్రణ రేఖతో పాటు ఇతర సెక్టార్లలో కాల్పుల విమరణకు సంబంధించి కుదిరిన ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని భారత్- పాక్ నిర్ణయించాయి. ఈ మేరకు ఓ సంయుక్త ప్రకటనను గురువారం విడుదల చేశాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి నిర్ణయాలు అమల్లోకి వచ్చినట్టు పేర్కొన్నాయి. ఈ మేరకు మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్-డీజీఎంవో స్థాయిలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
భారత్ -పాక్ మధ్య 2003లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. కానీ.. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఈ నేపథ్యంలో హాట్‌లైన్ ద్వారా డీజీఎంవో స్థాయిలో సమావేశం జరిగింది. సరిహద్దుల్లో శాంతిస్థాపన కోసం నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితులపై చర్చిచామని సంయుక్త ప్రకటనలో ఇరు దేశాలు వెల్లడించాయి. సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో జరిగినట్లు పేర్కొన్నాయి.
మరోవైపు ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో లోక్‌సభలో ఇదే అంశంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మూడేళ్లలో పాక్ మొత్తం 10వేల 752 సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిందని, ఇందులో 72 మంది భద్రతా సిబ్బంది, 70 మంది పౌరులు మరణించినట్టు వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com