India: ఉగ్రవాదులకు పాక్ ఆశ్రయం.. సొంత ప్రజల్నే చంపేస్తోంది..

దాయాది దేశం పాకిస్థాన్‌పై అంతర్జాతీయ వేదికగా భారత్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని.. సొంత ప్రజలనే బాంబులతో చంపేస్తోందని భారత్ విమర్శించింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి సమావేశంలో భారత దౌత్యవేత్త క్షితిజ్ త్యాగి ప్రసగించారు. భారతదేశానికి వ్యతిరేకంగా నిరాధారమైన, రెచ్చగొట్టే ప్రకటనలతో పాకిస్థాన్ దుర్వినియోగానికి పాల్పడుతుందని ధ్వజమెత్తారు. పాకిస్థాన్ సొంత పౌరులపై బాంబులు వేసి.. ప్రపంచవ్యాప్తంగా అస్థిరతను కలిగించడానికి ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తుందని భారత్ ఆరోపించింది. సొంత ప్రజలపై బాంబు దాడి చేయడం తర్వాత కూడా సమయం ఉంటే పడిపోతున్న ఆర్థికవ్యవస్థను.. సైనిక ఆధిపత్యంతో నిండిన రాజకీయ వ్యవస్థను కాపాడుకోవడంపై దాయాది దేశం దృష్టి పెట్టాలని భారత్ సూచించింది.
ఇటీవల పాక్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని ఓ గ్రామంపై వైమానిక దాడులు జరిగాయి. పాక్ వాయుసేన జరిపిన దాడుల్లో దాదాపు 30 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అనేక మంది చిన్నారులు, మహిళలు ఉన్నారు. కాలిపోయిన వాహనాలు, కూలిపోయిన భవనాలు, శిథిలాల నుంచి మృతదేహాలను బయటకు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com