India GCC FTA News : మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్ ..అమెరికా తర్వాత ఇప్పుడు అరబ్ దేశాలతో మెగా డీల్.

India GCC FTA News : మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్ ..అమెరికా తర్వాత ఇప్పుడు అరబ్ దేశాలతో మెగా డీల్.
X

India GCC FTA News : భారతదేశం తన విదేశీ వాణిజ్య సంబంధాలను కొత్త పుంతలు తొక్కించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. జనవరి 27న యూరోపియన్ యూనియన్ తో, ఆ తర్వాత అమెరికాతో కీలక ఒప్పందాలు చేసుకున్న భారత్.. నేడు (ఫిబ్రవరి 5, 2026) గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ‎తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ దిశగా మరో భారీ అడుగు వేస్తోంది. ఈ ఒప్పందంలో సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్, కువైట్, బహ్రెయిన్, ఖతార్ వంటి ఆరు శక్తివంతమైన గల్ఫ్ దేశాలు ఉన్నాయి. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో ఈ ఒప్పందానికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లు నేడు ఫైనల్ కానున్నాయి.

అమెరికా డీల్ ఇచ్చిన జోష్

అమెరికాతో జరిగిన తాజా వాణిజ్య ఒప్పందం భారత్‌కు పెద్ద ఊరటనిచ్చింది. ఈ డీల్ ప్రకారం.. భారత ఉత్పత్తులపై అమెరికా విధించిన టారిఫ్‌లను ఏకంగా 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. ఈ సానుకూల పరిణామం జరిగిన మూడు రోజులకే గల్ఫ్ దేశాలతో చర్చలు ముగింపు దశకు చేరుకోవడం విశేషం. ఇప్పటికే భారత్ యూఏఈ, ఒమన్‌లతో విడివిడిగా వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నప్పటికీ, ఇప్పుడు మొత్తం GCC కూటమితో ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల భారత ఎగుమతులు భారీగా పెరిగే అవకాశం ఉంది.

రెండు దశాబ్దాల నిరీక్షణకు తెర

నిజానికి భారత్-గల్ఫ్ దేశాల మధ్య ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలు నిన్న మొన్నటివి కావు. 2004లోనే దీనికి పునాది పడింది. ఆ తర్వాత 2006, 2008లో చర్చలు జరిగినప్పటికీ, 2011లో గల్ఫ్ దేశాలు అంతర్జాతీయ చర్చలను నిలిపివేయడంతో ఈ డీల్ ఆగిపోయింది. మళ్ళీ 2022లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చొరవతో చర్చలు పునరుద్ధరించబడ్డాయి. ఇప్పుడు 2026 ఫిబ్రవరిలో ఈ కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. దీనివల్ల చమురు దిగుమతులు సులభతరం కావడమే కాకుండా, భారతీయ నగల వ్యాపారులకు, ఇంజనీరింగ్ రంగానికి పెద్ద పీట వేయనున్నారు.

లక్షల కోట్ల వ్యాపారం.. ఎవరికి లాభం?

2025 ఆర్థిక సంవత్సరంలో భారత్, గల్ఫ్ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు 178.56 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది భారత్ మొత్తం గ్లోబల్ ట్రేడ్‌లో 15.42 శాతానికి సమానం. భారత్ ప్రధానంగా ముడి చమురు, సహజ వాయువును ఈ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ప్రతిగా భారత్ నుంచి ముత్యాలు, విలువైన రాళ్లు, నగల ఎగుమతులతో పాటు విద్యుత్ యంత్రాలు, ఇనుము, ఉక్కు, రసాయనాలను ఎగుమతి చేస్తోంది. ఈ కొత్త ఒప్పందం వల్ల ఎగుమతిదారులపై పన్నుల భారం తగ్గి, భారతీయ వస్తువులు గల్ఫ్ మార్కెట్లో చౌకగా లభిస్తాయి, తద్వారా మన వ్యాపారులకు భారీ లాభాలు చేకూరుతాయి.

Tags

Next Story