భారత్‌కు వస్తున్న గుర్తింపు, ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్న చైనా

భారత్‌కు వస్తున్న గుర్తింపు, ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్న చైనా

ప్రపంచ స్థాయిలో భారత్‌కు వస్తున్న గుర్తింపు, ఎదుగుదలను చూసి చైనా ఓర్వలేకపోతోంది. భారత్‌ను తన ప్రధాన ప్రత్యర్థిగా భావించిన చైనా.. అమెరికా, ఇతర ప్రజాస్వామ్య దేశాలతో భారత్‌కున్న వ్యూహాత్మక భాగస్వామ్యాలను విడగొట్టాలని చూస్తోంది. ఇందుకోసం అనేక పన్నాగాలు పన్నుతోందని అమెరికా విదేశాంగ విభాగం ఓ నివేదికలో తెలిపింది. భారత ఎదుగుదల తనకు ఇబ్బందిగా మారుతుందని, తన లక్ష్యాలను చేరుకోకుండా అడ్డుపడుతోందని చైనా భావిస్తోందని అమెరికా వెల్లడించింది. అందుకే ఆర్థికంగా దెబ్బకొట్టాలని చూస్తోందని నివేదికలో పేర్కొంది. అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా సహా ఇతర ప్రజాస్వామ్య దేశాలతో భారత్‌ పెంచుకుంటున్న వ్యూహాత్మక భాగస్వామ్యాలను విడగొట్టాలని చైనా ప్రయత్నిస్తోంది. సరిహద్దుల్లో రెచ్చగొట్టి లాభపడాలని చూస్తోంది. తన పొరుగున ఉన్న దేశాలు, ముఖ్యంగా ఆసియాన్‌ దేశాల భద్రత, స్వయం ప్రతిపత్తి, ఆర్థిక వ్యవస్థను అణగదొక్కాలని యోచిస్తోందని నివేదిక వెల్లడించింది. ఆసియా దేశాల్లో అమెరికా ప్రభావాన్ని తగ్గించి... తన ఆధిపత్యం చలాయించాలని వ్యూహాలు రూపొందిస్తోందని తెలిపింది. తద్వారా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదగాలని చైనా కుట్రలు పన్నుతోందని ఆరోపించింది.

భారత్‌-చైనా మధ్య గత కొన్ని నెలలుగా నెలకొన్న ప్రతిష్టంభనను కూడా అమెరికా ఈ నివేదికలో ప్రస్తావించింది. వివాదాస్పద సరిహద్దుల్లో భారత్‌ను రెచ్చగొట్టి ఇరువైపులా పదుల సంఖ్యలో జవాన్ల మరణానికి డ్రాగన్‌ కారణమైందని అగ్రరాజ్యం పేర్కొంది. ఇప్పటికే రెండు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న అంశాన్ని ప్రస్తావించింది. తూర్పు లద్దాఖ్‌, నియంత్రణ రేఖ వద్ద సరిహద్దు వివాదాల కారణంగా భారత్‌, చైనా మధ్య ఈ ఏడాది మే నుంచి ప్రతిష్టంభన నెలకొంది. జూన్‌ 15న గాల్వాన్‌ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఆ ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. చైనా వైపు కూడా చాలా మందే మరణించారు. అయితే ఆ సంఖ్యను చైనా ఇప్పటికీ వెల్లడించలేదు.

అటు తైవాన్‌తోనూ బీజింగ్‌ వివాదాలు సృష్టించుకుంటోందని పేర్కొంది. ప్రజాస్వామ్య దేశంగా ఉన్న తైవాన్‌ను చైనా తన భూభాగంగా చెప్పుకుంటూ బలవంతంగా తమ దేశంలో విలీనం చేసుకోవాలని యత్నిస్తోందని అమెరికా విమర్శించింది.

కరోనా మహమ్మారి ప్రపంచమంతా వ్యాపించడానికి కూడా చైనాయే కారణమని అమెరికా మరోసారి ఆక్షేపించింది. చైనా నిర్లక్ష్యం వల్లే వుహాన్‌లో కరోనా వైరస్‌ పుట్టిందని, ఆ తర్వాత ప్రపంచమంతా పాకి కోట్లాది మంది జీవితాలను అస్తవ్యస్తం చేసిందని బీజింగ్‌పై విరుచుకుపడింది.


Tags

Read MoreRead Less
Next Story