BRICS Summit 2023: భవిష్యత్ ఆర్థిక దిక్సూచి భారత్
భవిష్యత్తులో మొత్తం ప్రపంచ వృద్ధికే భారత్ ఒక ఇంజన్‌లా నిలుస్తుందని ధీమా వ్యక్తం ప్రధాని మోదీ చేశారు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బ్రిక్స్ బిజినెస్ ఫోరం లీడర్స్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ త్వరలోనే 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ఖాయమని, ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ ఇక్కడే ఉందన్నారు. 100కుపైగా యూనికార్న్ కంపెనీలు పని చేస్తున్నాయని వెల్లడించారు.
జీఎస్‌టీ అమలుతో పెట్టుబడిదారుల విశ్వాసం పెరిగిందని.. భారత్‌లో వీధి వ్యాపారులు కూడా యూపీఐ వాడుతున్నారని.. భారత్‌ను తయారీ హబ్‌గా రూపొందించడానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. 15వ బ్రిక్స్ సమావేశానికి జొహాన్నెస్‌బర్గ్‌లోని సమ్మర్ ప్లేస్.. వేదిక అయింది. బ్రిక్స్‌లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలకు సభ్యత్వం ఉంది. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా, రష్యా తరఫున ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి సెర్గెయ్ లావ్రొవ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధినేత గ్ఝి జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా- ఈ అత్యున్నత సదస్సుకు హాజరయ్యారు.
సమ్మర్ ప్లేస్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి సిరిల్ రమాఫోసా సాదర స్వాగతం పలికారు. సదస్సు ప్రారంభ సూచికగా వారందరూ గ్రూప్ ఫొటో దిగారు. ఒకే వేదికపై ప్రధాని మోదీ, జిన్‌పింగ్ కనిపించారు. ఇద్దరు చిరునవ్వుతో పలకరించుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. గ్రూప్ ఫొటో దిగారు.
అంతకు ముందు వాటర్‌క్లూఫ్ వాయుసేన స్థావరంలో మంగళవారం ల్యాండ్ అయిన భారత ప్రధానికి దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాల్ మషాటిలే స్వాగతం పలికారు. అనంతరం బ్రిక్స్ సదస్సు జరగనున్న శాండ్‌టన్ సన్ హోటల్‌కు చేరుకున్న మోదీకి సంగీత వాయిద్యాలు, భారత పతాకాలతో ప్రవాస భారతీయులు ఆహ్వానం పలికారు. వారిలో ఇద్దరు మహిళలు ఆయనకు రాఖీ కట్టారు.అనంతరం నార్త్ రైడింగ్‌లో 14.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న స్వామినారాయణ్ ఆలయాన్ని ప్రధాని సందర్శించారు.
బ్రిక్స్ గ్రూపులో భారత్‌తో పాటు రష్యా, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. 2019 తర్వాత బ్రిక్స్ నేతల ముఖాముఖి సదస్సు ఇదే. అయితే ఉక్రెయిన్ యుద్ధం విషయమై అంతర్జాతీయ నేర న్యాయస్థానం రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో ఆయన వర్చ్యువల్ గా పాల్గొన్నారు. ఈ సదస్సు ముగిసిన అనంతరం గ్రీస్‌లో ఒకరోజు పర్యటనకు ప్రధాని చేరుకుంటారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com