Indo-US Trade Deal : భారత్-అమెరికా వాణిజ్య చర్చలకు బ్రేక్.. ట్రంప్ టారిఫ్ ప్లాన్‌కు సుప్రీం కోర్టు షాక్.

Indo-US Trade Deal : భారత్, అమెరికా దేశాల మధ్య కుదరాల్సిన అత్యంత కీలకమైన మధ్యంతర వాణిజ్య ఒప్పందం పై చర్చలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. వాస్తవానికి ఈ నెల 23 నుంచి 26వ తేదీ వరకు వాషింగ్టన్‌లో ఇరు దేశాల ప్రతినిధులు భేటీ కావాల్సి ఉంది. ఈ సమావేశంలో ఒప్పందానికి సంబంధించిన చట్టపరమైన ముసాయిదాను ఖరారు చేయాలని భావించారు. అయితే, అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులు, ముఖ్యంగా అమెరికాలో చోటుచేసుకుంటున్న పరిణామాలను సమీక్షించుకోవడానికి రెండు దేశాలు ఈ సమావేశాన్ని వాయిదా వేశాయి. తదుపరి చర్చల తేదీని త్వరలోనే ఖరారు చేయనున్నారు.
ట్రంప్ టారిఫ్ నిర్ణయానికి సుప్రీం కోర్టు బ్రేక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతులపై సుంకాలను 10 శాతం నుంచి 15 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై అక్కడి సుప్రీం కోర్టు ట్రంప్‌కు గట్టి షాక్ ఇచ్చింది. IEEPA చట్టం కింద ప్రపంచ దేశాలపై ఇలాంటి భారీ సుంకాలు విధించడం చట్టవిరుద్ధమని కోర్టు తేల్చి చెప్పింది. అధ్యక్షుడు తన పరిధిని మించి వ్యవహరించారని పేర్కొంది. ఈ తీర్పు ట్రంప్ ఆర్థిక విధానాలకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. దీనివల్ల భారత ఎగుమతులకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది.
భారత్‌పై సుంకాల బాదుడు.. ఇప్పటి పరిస్థితి ఏంటి?
గత ఏడాది (2025) ఆగస్టులో అమెరికా ప్రభుత్వం భారత్‌పై 25 శాతం రెసిప్రోకల్ టారిఫ్ విధించింది. దానికి తోడు రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందున మరో 25 శాతం అదనపు డ్యూటీ వేయడంతో మొత్తం సుంకం 50 శాతానికి చేరింది. అయితే, ఇటీవలి చర్చల ఫలితంగా ఆ 25 శాతం పెనాల్టీని తొలగించారు. కానీ ఇంకా మిగిలిన 25 శాతం అదనపు పన్ను అమల్లోనే ఉంది. ఒకవేళ ట్రంప్ ప్రతిపాదించిన కొత్త 15 శాతం సుంకం కూడా అమల్లోకి వస్తే, ఇప్పటికే ఉన్న సాధారణ సుంకంతో కలిపి భారతీయ ఉత్పత్తులపై పన్ను భారం భారీగా పెరగనుంది.
ఏప్రిల్ నుంచే అమలు? వాణిజ్య సంబంధాల్లో కొత్త మలుపు
ఒప్పందం మార్చి నాటికి ఖరారైతే, ఏప్రిల్ నుంచి అమల్లోకి రావచ్చని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ గతంలో ధీమా వ్యక్తం చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఏకంగా 186 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఈ నేపథ్యంలో కుదరబోయే కొత్త ఒప్పందం మన దేశ ఎగుమతిదారులకు, పారిశ్రామికవేత్తలకు ఎంతో కీలకం కానుంది. ఐటీ, ఫార్మా, టెక్స్‌టైల్స్ వంటి రంగాల్లో భారత్ తన సత్తా చాటుకునేందుకు ఇది ఒక గొప్ప అవకాశంగా నిపుణులు భావిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
