Iran Israel War : చమురు నిల్వల్లో భారత్ సరికొత్త రికార్డ్.. యుద్ధం వచ్చినా 45 రోజులు డోకా లేదు.

Iran Israel War : ఇరాన్ సంక్షోభం ముదురుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సెగలు రేగుతున్నాయి. ముఖ్యంగా సముద్ర మార్గంలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా ముడి చమురు సరఫరాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధం మరో నెల రోజుల పాటు కొనసాగవచ్చని స్పష్టం చేయడంతో గ్లోబల్ ఎకానమీలో టెన్షన్ మొదలైంది. అయితే, ప్రపంచ దేశాలు వణికిపోతున్నా.. భారత్ మాత్రం ధీమాగా ఉంది. దీనికి కారణం మన దగ్గర ఉన్న అపారమైన చమురు నిల్వలే! ఇరాన్ సెగలు తగిలినా, సరఫరా ఆగినా సరే.. దాదాపు 45 రోజుల పాటు దేశ అవసరాలకు సరిపడా ముడి చమురు నిల్వలు భారత్ వద్ద సిద్ధంగా ఉన్నాయి.
ప్రముఖ ఇంధన విశ్లేషణ సంస్థ కెప్లర్ అందించిన లెక్కల ప్రకారం.. భారత్ వద్ద ప్రస్తుతం సుమారు 10 కోట్ల బ్యారెల్స్ ముడి చమురు నిల్వలు ఉన్నాయి. ఇందులో మన రిఫైనరీల వద్ద ఉన్న స్టాక్, భూగర్భ వ్యూహాత్మక చమురు నిల్వలు, సముద్రంలో భారత్ వైపు ప్రయాణిస్తున్న చమురు నౌకల్లోని స్టాక్ అంతా కలిపి ఉంది. భారత్ తన చమురు అవసరాల్లో దాదాపు 88 శాతం దిగుమతులపైనే ఆధారపడుతుంది. ఇందులో సగానికి పైగా పశ్చిమ ఆసియా నుంచే వస్తుంది. ప్రతిరోజూ భారత్ దిగుమతి చేసుకునే 50 లక్షల బ్యారెల్స్ లో సగం (25 లక్షల బ్యారెల్స్) ఈ హోర్ముజ్ మార్గం నుంచే రావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ మార్గం మూతపడినా 45 రోజుల వరకు మన దేశం ఆగే ప్రసక్తే లేదని గణాంకాలు చెబుతున్నాయి.
చమురు ధరల విషయానికి వస్తే.. యుద్ధ మేఘాల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 80 డాలర్ల మార్కును దాటేసింది. ఇది యుద్ధం మొదలవ్వకముందు కంటే 10 శాతం ఎక్కువ. సరఫరా ఆగిపోతే తక్షణమే ధరలు పెరిగే అవకాశం ఉంటుందని కెప్లర్ రీసెర్చ్ అనలిస్ట్ సుమిత్ రితొలియా హెచ్చరించారు. అయితే ముందే బయలుదేరిన చమురు నౌకలు భారత్ చేరుతుండటం వల్ల ప్రస్తుతానికి ఎలాంటి కొరత ఉండదు. కానీ యుద్ధం నెలల తరబడి సాగితే మాత్రం రవాణా ఖర్చులు పెరిగి దిగుమతి బిల్లు భారం అయ్యే ప్రమాదం ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ చమురు దిగుమతుల కోసం ఏకంగా 137 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ఈ ఏడాది కూడా ఆ ఖర్చు భారీగానే ఉండేలా కనిపిస్తోంది.
ఒకవేళ హోర్ముజ్ మార్గం పూర్తిగా మూసుకుపోతే భారత్ ఏం చేయబోతోంది? దీనికి విశ్లేషకులు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు. పశ్చిమ ఆసియా కాకుండా పశ్చిమ ఆఫ్రికా, లాటిన్ అమెరికా, అమెరికా, రష్యా నుంచి అదనపు చమురును దిగుమతి చేసుకునే అవకాశం భారత్ కు ఉంది. గతంలో లాగే రష్యా నుంచి తక్కువ ధరకే చమురు పొందే దిశగా అడుగులు పడవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుతానికి చమురు కొరత కంటే, పెరుగుతున్న ధరలే భారత్ కు అసలైన సవాలు. ఏదేమైనా 45 రోజుల సేఫ్టీ నెట్ ఉండటం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ఇప్పట్లో ఎలాంటి ముప్పు లేదని స్పష్టమవుతోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
