Visa Free Entry: భారతీయ పర్యాటకులకు వీసా ఫ్రీ ఎంట్రీ

Visa Free Entry: భారతీయ పర్యాటకులకు వీసా ఫ్రీ ఎంట్రీ
షరతులు వర్తిస్తాయి

భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పింది ఇరాన్ (Iran) దేశ ప్రభుత్వం. వీసా రహిత ప్రయాణానికి అనుమతి ఇస్తూనే… పలు షరతులను విధించింది. ఈ వివరాలను ఆ దేశ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది, కేవలం విమాన ప్రయాణికులకు మాత్రమే ఈ నిర్ణయం వర్తిస్తుందని స్పష్టం చేసింది.ఈ మేరకు వీసా కలిగి ఉండాలన్న నిబంధనలను ఈ నెల 4 నుంచి ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించింది. సాంస్కృతిక, పర్యాటక సంబంధాల మార్పిడిని మరింత వేగవంతం చేసుకొనేందుకు ఈ నూతన విధానం అమలు చేస్తున్నట్టు తెలిపింది. గరిష్టంగా 15 రోజులు మాత్రమే ఉండేందుకు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది.

భారతదేశం, రష్యా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇండోనేషియా, జపాన్, సింగపూర్, మలేషియా, బ్రెజిల్ మరియు మెక్సికోలతో సహా 33 దేశాలకు వీసా- ఫ్రీ నిర్ణయాన్ని ఇరాన్ డిసెంబర్‌లో ఆమోదించింది. ఇరాన్ సాంస్కృతిక వారసత్వం, పర్యాటకం మరియు హస్తకళల మంత్రి ఎజ్జతోల్లా జర్ఘామి మాట్లాడుతూ…. ఈ నిర్ణయం ద్వారా…. ఇరాన్ లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ప్రపంచ దేశాల నుండి ఎక్కువ మంది సందర్శకులను ఆకర్షించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో నెలకొని ఉన్న ఇరానో ఫోబియా ను అంతం చేయాలని, ఆ ఇరానోఫోబియాను ప్రచారం చేస్తున్నవారి ఆట కట్టించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

షరతులు ఏంటంటే ..

వీసా లేకుండానే ప్రయాణాలకు అనుమతి ఇచ్చిన ఇరాన్ ప్రభుత్వం… నాలుగు షరతులను విధించింది. ఈ మేరకు ఇరాన్ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో వివరాలను పేర్కొంది. సాధారణ పాస్‌పోర్ట్‌లు కలిగిన భారతీయులు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వీసా లేకుండా ఇరాన్‌లోకి ప్రవేశించేందుకు అనుమతి ఇస్తామని తెలిపింది. గరిష్టంగా 15 రోజులు మాత్రమే బస చేయాల్సి ఉంటుందని వెల్లడించింది. కేవలం విమానప్రయాణాల ద్వారా వచ్చే ప్రయాణికులకు ఈ మాత్రమే ఈ నిర్ణయం వర్తిస్తుందని వివరించింది. పర్యాటకం కోసం ఇరాన్ కు వచ్చే భారతీయులకు కూడా ఇది వర్తిస్తుందని చెప్పింది. అయితే ఎక్కువ రోజుల పాటు ఉండాలనుకునే భారతీయ పౌరులు…. భారత్ లో ఉన్న ఇరాన్ రాయబార కార్యాలయం నుండి అవసరమైన వీసాలను పొందాలని పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story