Israel : ఇజ్రాయెల్ గగన తలంలో 2 రోజుల ఎమర్జెన్సీ

ఉత్తర ఇజ్రాయెల్‌పై దాడులతో ఆ ప్రాంతంలోని బెన్ గురియన్ విమానాశ్రయాన్ని గంటపాటు అధికారులు మూసివేశారు. దాడుల నేపథ్యంలో టెల్ అవీవ్‌కు పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. యుద్ధ విస్తరణపై ఈజిప్టు హెచ్చరికలు జారీ చేసింది. లెబనాన్‌లో సుస్థిరతకు పిలుపునిచ్చింది. పరిస్థితిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమీక్షించారు. అమెరికా చేపట్టాల్సిన తదుపరి చర్చలపై ఉన్నతాధికారులతో చర్చించారు. ఇజ్రాయెల్ దాడుల్లో ముగ్గురు ఫైటర్లు మృతి చెందారని లెబనాన్ తెలిపింది.
హెజ్‌బొల్లా తమ దేశంపై భారీగా రాకెట్లను, డ్రోన్లను, క్షిపణులను ప్రయోగించనుందని సమాచారం అందాకే వైమానిక దాడులకు దిగినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఉత్తర ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా ప్రయోగించిన వందలకొద్దీ రాకెట్లను అడ్డుకున్నామని, ప్రజలు అధికారుల ఆదేశాలను పాటించాలని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. తమకు నష్టం కలగజేసే వారికి తప్పకుండా నష్టం చేస్తామని స్పష్టం చేశారు. ఇది ముగింపు కాదని తేల్చి చెప్పారు.
దాడుల నేపథ్యంలో లెబనాన్ క్యాబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. దీనికి తాత్కాలిక ప్రధాని నజీబ్ మికాటీ అధ్యక్షత వహించారు. తొలుత ఇజ్రాయెల్‌ను ఆపేలా ప్రయత్నించాలని నిర్ణయించారు.
ఇజ్రాయెల్ సైనిక స్థావరాలుసహా గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు హెజ్‌బొల్లా తెలిపింది. దేశంలో 48 గంటలపాటు ఎమర్జెన్సీని విధించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
తమ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకడైన ఫవాద్ షుకుర్‌ను గత నెలలో ఇజ్రాయెల్ హతమార్చినందుకు నిరసనగానే తాము దాడులకు దిగినట్లు హెజ్‌బొల్లా ప్రకటించింది. మొత్తం 320 కత్యూషా రాకెట్లతోపాటు డ్రోన్లను ప్రయోగించామని తెలిపింది. గాజాలో కాల్పుల విరమణ ప్రకటిస్తే దాడులను ఆపుతామని ఆ సంస్థ స్పష్టం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com