Israel : కలుగులో ఎలుకను పట్టినట్టు! హమాస్‌తో యుద్ధంలో ఇజ్రాయెల్ మరో విజయం..

Israel : కలుగులో ఎలుకను పట్టినట్టు! హమాస్‌తో యుద్ధంలో ఇజ్రాయెల్ మరో విజయం..
X

హమాస్ తో యుద్ధంలో ఇజ్రాయెల్‌ కు భారీ విజయం లభించింది. హమాస్‌ మిలిటెంట్‌ సంస్థ అధినేత యహ్యా సిన్వర్‌ ను ఐడీఎఫ్‌ దళాలు మట్టుబెట్టాయి. గతేడాది అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై మారణకాండకు యహ్యా సిన్వర్‌ దే మాస్టర్‌మైండ్‌. ఈ ఘటనలో 1200 మంది ఇజ్రాయెల్‌ వాసులు చనిపోయారు. దాదాపు 250 మందిని హమాస్‌ మిలిటెంట్లు బందీలుగా చేసుకుంది. దీంతో సిన్వర్‌ జాడ కోసం ఇజ్రాయెల్‌ తీవ్రమైన వేట కొనసాగించింది. ఎట్టకేలకు హమాస్‌ అగ్రనేతను హతమార్చింది. దీంతో ఈ పోరులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

అక్టోబర్‌ 7న ఘటన తర్వాత తన ఉనికి తెలియకుండా యహ్యా బంకర్లలో, సొరంగాల్లో తలదాచుకుంటున్నారు. గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్‌ ఎన్నో వేల దాడులు చేసినప్పటికీ అతడి జాడను ఐడీఎఫ్‌ బలగాలు కనిపెట్టలేకపోయాయి. మిలిటెంట్ల ఏరివేతే లక్ష్యంగా గాజా స్ట్రిప్‌లో ఐడీఎఫ్‌ బలగాలు రోజూ పెట్రోలింగ్‌ చేస్తాయి. అక్టోబర్‌ 16న రఫా నగరంలో మిలిటెంట్ల కదలికల నేపథ్యంలో ట్యాంకర్‌ నుంచి ఇజ్రాయెల్‌ బలగాలు ఓ భవనంపై షెల్‌ను ప్రయోగించాయి. దీంతో ఆ భవనం కుప్పకూలింది. అయితే అందులో సిన్వర్‌ ఉన్నట్లు వారికి తెలియదు. దీంతో సైనికులు ఆ భవనాన్ని పరిశీలించగా ముగ్గురు హమాస్‌ మిలిటెంట్లు చనిపోయి ఉన్నారు. అయితే వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు మృతుల్లో సిన్వర్‌ ఉన్నాడేమోనని అనుమానించిన ఐడీఎఫ్‌.. డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించింది. అనంతరం చనిపోయింది హమాస్‌ అధినేతే అని తెలియడంతో మీడియాకు వెల్లడించింది.

సిన్వర్‌ తన చుట్టూ ఎప్పుడూ రక్షణ కవచంగా ఇజ్రాయెల్‌ బందీలను ఉంచుకుంటారని సమాచారం. అయితే బాంబు దాడి జరిగిన సమయంలో మిలిటెంట్లు ఉన్న భవనంలో బందీలు ఎవరూ లేరు. మరోవైపు గత కొద్దిరోజులుగా సిన్వర్‌ కదలికలపై ఇజ్రాయెల్‌కు సమాచారం అందడం లేదు. ఆయన ఉనికి ఐడీఎఫ్‌కు మిస్టరీగా మారింది. అతడు ప్రాణాలతోనే ఉన్నరా లేదా అనే విషయం తెలుసుకోవడానికి ఇజ్రాయెల్‌ విశ్వప్రయత్నాలు చేసింది. ఇక దాడి చేసిన భవనానికి సంబంధించి ఇజ్రాయెల్‌ మీడియాలో ఫొటోలు ప్రచురితం అయ్యాయి. అందులో సిన్వర్‌ బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌, గ్రెనేడ్‌లు ధరించి భవన శిథిలాల్లో పడి ఉన్నాడు. తలకు బలమైన గాయమైంది. హమాస్‌పై కీలక విజయం సాధించడంతో ఇజ్రాయెల్‌ రక్షణశాఖ మంత్రి యోవ్‌ గ్యాలంట్‌ సైనికులకు సెల్యూట్‌ చేశారు. సిన్వర్‌ మృతితో గాజా వాసులకు స్పష్టమైన సందేశం వెళ్లిందన్నారు. గాజా స్ట్రిప్‌లో ప్రజలు ఇబ్బందులు పడటానికి అతడి హంతక చర్యలే కారణమన్నారు.

Tags

Next Story