Valentino Garavani: ఇటాలియన్ ఫ్యాషన్ దిగ్గజం వాలెంటినో గరవాని కన్నుమూత

నివాళులర్పించిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ

ప్రముఖ ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్, 'వాలెంటినో' బ్రాండ్ వ్యవస్థాపకుడు వాలెంటినో గరవాని (93) కన్నుమూశారు. సోమవారం రోమ్‌లోని తన నివాసంలో ఆయన ప్రశాంతంగా తుదిశ్వాస విడిచినట్లు ఆయన ఫౌండేషన్ అధికారికంగా ప్రకటించింది. వయోభారంతోనే ఆయన మరణించినట్లు తెలుస్తోంది.

వాలెంటినో తన కుటుంబ సభ్యుల సమక్షంలో కన్నుమూసినట్లు 'ఫొండాజియోన్ వాలెంటినో గరవాని ఇ జియాన్కార్లో గియామెట్టి' ఒక ప్రకటనలో తెలిపింది. ఆయన మృతి పట్ల ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. "వాలెంటినో స్టైల్, సౌందర్యానికి తిరుగులేని మాస్టర్. ఇటాలియన్ హై ఫ్యాషన్‌కు శాశ్వత చిహ్నం. ఇటలీ ఒక లెజెండ్‌ను కోల్పోయింది" అని ఆమె నివాళులర్పించారు.

1932లో జన్మించిన వాలెంటినో, 1960లో తన భాగస్వామి జియాన్‌కార్లో గియామెట్టితో కలిసి రోమ్‌లో ఫ్యాషన్ హౌస్‌ను ప్రారంభించారు. దాదాపు 50 ఏళ్ల పాటు ఫ్యాషన్ ప్రపంచాన్ని ఏలిన ఆయన 2008లో రిటైర్ అయ్యారు. ఆయన సృష్టించిన ప్రత్యేకమైన ఎరుపు రంగు 'వాలెంటినో రెడ్'గా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. జాక్వెలిన్ కెన్నెడీ, ప్రిన్సెస్ డయానా వంటి ఎందరో ప్రముఖులకు ఆయన దుస్తులు డిజైన్ చేశారు.

వాలెంటినో అంత్యక్రియలు జనవరి 23న రోమ్‌లో జరగనున్నాయి. జనవరి 21, 22 తేదీల్లో ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఫౌండేషన్ కార్యాలయంలో ఉంచుతారు.

Tags

Next Story