21 Jan 2021 1:54 AM GMT

Home
 / 
అంతర్జాతీయం / అమెరికా తొలి మహిళా...

అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌.. తమిళనాడులో సంబరాలు

మలాహారిస్‌ను వైస్‌ ప్రెసిడెంట్‌ అభ్యర్థిగా ఎంపిక చేయడం కూడా బైడెన్‌కు కలిసివచ్చిందని చెప్పొచ్చు.

అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌.. తమిళనాడులో సంబరాలు
X

అమెరికా వైస్ ప్రెసిడెంట్‌ పదవిని చేపట్టడం ద్వారా కమలా హారిస్ చరిత్ర సృష్టించారు. అమెరికా ఉపాధ్యక్ష పీఠం అధిరోహించిన తొలి మహిళ ఆమె. అంతేకాదు, ఆ పదవిని అందుకున్న తొలి ఆసియా-భారతీయ సంతతికి చెందిన వ్యక్తి హారిస్. హోవార్డ్ యూనివర్సిటీలో మొదలైన ఆమె ప్రస్థానం.. వైస్‌ ప్రెసిడెంట్‌వరకు విజయవంతంగా సాగింది.

కమలా హారిస్ తల్లి తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. తండ్రి జమైకాలో పుట్టారు. కమలా తండ్రి డోనల్డ్ హారిస్.. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్. తల్లి శ్యామల గోపాలన్ క్యాన్సర్ పరిశోధకురాలు, పౌర హక్కుల కార్యకర్త. కమల హోవార్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. అమెరికాలో నల్లజాతీయులు ఎక్కువగా చదువుకునే యూనివర్సిటీల్లో ఇది కూడా ఒకటి. తన జీవితంపై ఎక్కువగా ప్రభావితం చూపిన అనుభవాల్లో కాలేజీ జీవితమూ ఒకటని ఆమె చెబుతుంటారు. కమల న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందారు. శాన్ ఫ్రాన్సిస్కో సిటీ అటార్నీగా పనిచేసారు. తరువాత కాలిపోర్నియా అటార్నీ జనరల్ గా కొనసాగారు. కాలిఫోర్నియా అటార్నీ జనరల్ పదవి చేపట్టిన తొలి మహిళ, తొలి ఆఫ్రికన్ అమెరికన్, తొలి ఏసియన్ అమెరికన్ కమలా హారిస్.

వాక్పటిమ, సంభాషణా చాతుర్యంతో చాలా తక్కువ సమయంలోనే ప్రజాకర్షణ పొందిన జాతీయ స్థాయి నాయకురాలిగా ఎదిగారు కమలా హారిస్. అమెరికాలోని నల్లజాతి రాజకీయ నేతల్లో కమలా ప్రముఖురాలు. భారత్ మూలాల పట్ల కూడా ఆమె గర్వం వ్యక్తం చేస్తుంటారు. కమలాపై ఆమె తల్లి శ్యామల గోపాలన్ ప్రభావం చాలా ఎక్కువ. చాలా సార్లు ఆమె ఈ విషయాన్ని ప్రస్తావించారు. తన తల్లిని కమలా స్ఫూర్తిగా భావిస్తారు.

కమలా హారిస్‌ని ఎక్కువగా నల్లజాతి అమెరికన్ రాజకీయ నేతగానే అక్కడివారు చూస్తుంటారు. జాతి విద్వేషానికి వ్యతిరేకంగా 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్' ఉద్యమం జోరందుకున్న నేపథ్యంలో ఈ గుర్తింపుకు ప్రాధాన్యత కూడా పెరిగింది. మరోవైపు భారతీయ అమెరికన్లు కూడా కమలాను తమలో ఒకరిగా చూసుకున్నారు. ఆమె గెలుపుతో అమెరికాలో ఉంటున్న భారతీయ, దక్షిణాసియా వర్గాలకు మరింత గుర్తింపు వస్తుందని భావిస్తున్నారు.

జాతీయ స్థాయిలో తన నాయకత్వ లక్షణాలను ఇదివరకే నిరూపించుకున్నారు కమలా హారిస్. మొదటిరోజునుంచే ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించగలిగే సత్తా ఉన్న వ్యక్తి. ఇంటెలిజెన్స్, జ్యుడీషరీ విభాగాల్లో ఆమె ఒక దృఢమైన, సమర్థవంతమైన సెనేటర్ గా గుర్తింపు పొందారు. నేరస్థులను శిక్షించడం, వివాహ వ్యవస్థలో సమానత్వం తీసుకురావడంలోనూ ఆమె గొప్ప నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారు. కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి సందర్భంగా తలెత్తిన జాతి అసమానతల పట్ల కూడా ఆమె చాలా కఠినంగా వ్యవహరించారు.కమలాహారిస్‌ను వైస్‌ ప్రెసిడెంట్‌ అభ్యర్థిగా ఎంపిక చేయడం కూడా బైడెన్‌కు కలిసివచ్చిందని చెప్పొచ్చు..ఎలాంటి బెరుకూ లేకుండా పోరాడే యోధురాలు ఆమె. దేశంలోని అత్యుత్తమ ప్రజా సేవకురాల్లో ఒకరు అంటూ బైడెన్ చాలా సార్లు ప్రశంసించారు.

అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ ప్రమాణ స్వీకారంతో ఆమె పూర్వీకుల గ్రామమైన తమిళనాడులోని తిరువారూర్‌ జిల్లా తులసేంద్రిపురంలో పండగ వాతావరణం నెలకొంది. గ్రామంలో రహదారులను శుభ్రం చేసి కమలా హారిస్‌ ఫొటోలను ఏర్పాటు చేశారు. గ్రామస్థులు పిండి వంటలు చేసుకుని వేడుకలు జరుపుకున్నారు.

Next Story