Kamala Harris : ట్రంప్ ఓడిపోవడం ఖాయం : కమలా హారిస్
అమెరికన్ ప్రజలు రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని ఆ దేశ వైస్ ప్రెసిడెంట్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ అన్నారు. దేశం కోసం కొత్త మార్గాన్ని నిర్దేశించాలని నిర్ణయించుకున్నారన్నారు. అధ్యక్ష అభ్యర్థిగా ఖరారైన తర్వాత ఆమె తొలిసారి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అక్రమ వలసలపై కఠినంగా వ్యవహరిస్తానని కమలా హారిస్ ప్రకటించారు. చమురు, సహజవాయువు వెలికితీతకు మద్దతునిస్తానని వెల్లడించారు. సుదీర్ఘకాలంగా తాను అవలంబిస్తున్న ఉదారవాద విలువలను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో వీడేది లేదని తేల్చి చెప్పారు. సందర్భంగా ట్రంప్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆయన అమెరికన్లను, వారి శక్తిసామర్థ్యాలను తక్కువ చేసే అజెండాతో పని చేస్తున్నారని ఆరోపించారు. దేశాన్ని విభజిస్తున్నారని విమర్శించారు. ఈ విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.తాను అధికారంలోకి వస్తే కేబినెట్‌లోకి రిపబ్లికన్‌ను తీసుకుంటానని హారిస్ ప్రకటించడం గమనార్హం. ఇదే ఇంటర్వ్యూలో ఆమెతో పాటు ఉపాధ్యక్ష అభ్యర్థి టిమ్ వాజ్ సైతం పాల్గొన్నారు. చమురు వెలికితీత, వలసవిధానం విషయంలో తనపై వస్తున్న విమర్శలను ఆమె కొట్టిపారేశారు. ఒకప్పుడు చమురు వెలికితీతను తప్పుబట్టారని.. అక్రమ వలసలపై ఉదారంగా వ్యవహరించారనడంలో వాస్తవం లేదని చెప్పుకొచ్చారు. అధ్యక్షురాలిగా తాను ఎట్టిపరిస్థితుల్లో చమురు వెలికితీతను నిషేధించబోనని స్పష్టంచేశారు. తద్వారా శిలాజ ఇంధనాలు అధికంగా ఉన్న పెన్సిల్వేనియా రాష్ట్రం వివాదానికి ముగింపు పలికారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాలను నిర్ధరించే కీలక రాష్ట్రాల్లో ఇదొకటి కావడం గమనార్హం. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలని ఆమె ఆకాంక్షించారు. మిత్ర దేశమైన ఇజ్రాయెల్ విషయంలో అధ్యక్షుడు బైడెన్ విధానాలనే తాను కొనసాగిస్తానని హామీ ఇచ్చారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com