Kerosene : తిరిగి వస్తున్న కిరోసిన్ రోజులు.. యుద్ధం దెబ్బకు గ్యాస్ సిలిండర్లకు బ్రేక్.

Kerosene : మధ్యప్రాచ్యంలో రగులుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు మన వంటింట్లో మంట పుట్టిస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య సాగుతున్న పోరు కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా వ్యవస్థ అతలాకుతలమైంది. ఈ క్రమంలో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడటంతో, ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు దశాబ్దం క్రితం మనం వదిలేసిన కిరోసిన్ మళ్ళీ మన జీవితాల్లోకి తిరిగి రాబోతోంది. హోర్ముజ్ జలసంధి గుండా సాగాల్సిన గ్యాస్ సరఫరా ఆగిపోవడంతో, గృహ అవసరాల కోసం కిరోసిన్ కోటాను పెంచుతూ కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది.
అసలు గ్యాస్ సిలిండర్ల కొరత ఎందుకు వచ్చిందంటే.. భారత్ తన చమురు అవసరాల్లో దాదాపు 88 శాతం దిగుమతులపైనే ఆధారపడుతుంది. హోర్ముజ్ జలసంధి ద్వారా మన దేశానికి రోజూ 25 నుండి 27 లక్షల బ్యారెళ్ల ముడి చమురు వస్తుంది. అంతేకాకుండా, మన దేశానికి కావాల్సిన 55 శాతం ఎల్‌పీజీ గ్యాస్ కూడా ఇదే మార్గం ద్వారా రావాలి. యుద్ధం వల్ల ఈ సముద్ర మార్గంలో నౌకల రాకపోకలు ఆగిపోవడంతో గ్యాస్ నిల్వలు తగ్గిపోయాయి. దీంతో ప్రభుత్వం గృహ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ, హోటళ్లు, రెస్టారెంట్లకు ఇచ్చే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో కోత విధించింది. దీనివల్ల హోటల్ యజమానులు వంట కోసం ప్రత్యామ్నాయంగా బొగ్గు, బయోమాస్ వాడుకోవడానికి ప్రభుత్వం తాత్కాలికంగా అనుమతినిచ్చింది.
సామాన్య ప్రజలకు గ్యాస్ కష్టాలు తప్పించడానికి ప్రభుత్వం కిరోసిన్ అస్త్రాన్ని బయటకు తీసింది. రాష్ట్రాలకు ప్రతి నెల ఇచ్చే ఒక లక్ష కిలోలీటర్ల రెగ్యులర్ కిరోసిన్ కోటాకు అదనంగా మరో 48,000 కిలోలీటర్లను కేటాయించింది. గడచిన పదేళ్లలో కిరోసిన్ కోటాను ఇంత భారీగా పెంచడం ఇదే మొదటిసారి. కిరోసిన్ కనుమరుగైపోతున్న ఈ కాలంలో మళ్ళీ ప్రభుత్వం దీన్ని ప్రోత్సహించాల్సి రావడం గమనార్హం.
మరోవైపు గ్యాస్ కొరత వస్తుందన్న వార్తలతో ప్రజలు భయాందోళనలకు గురై అదనపు సిలిండర్లను బుక్ చేసుకుంటున్నారు. దీన్ని అరికట్టడానికి ప్రభుత్వం కొత్త నిబంధనను తీసుకువచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత రెండో సిలిండర్ కోసం కనీసం 45 రోజులు ఆగాల్సి ఉంటుంది. గతంలో ఈ గడువు 21 రోజులుగా ఉండేది. పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఈ పరిమితి 25 రోజులుగా ఉంది. దేశంలో గ్యాస్ కొరత ఏమీ లేదని, కేవలం యుద్ధం వల్ల రవాణాలో జాప్యం జరుగుతోందని, ప్రజలు అనవసరంగా స్టాక్ పెట్టుకోవద్దని పెట్రోలియం మంత్రిత్వ శాఖ కోరుతోంది. ప్రస్తుతం 40 దేశాల నుండి మనకు చమురు సరఫరా అవుతున్నప్పటికీ, యుద్ధ ప్రభావం వల్ల ధరలు మరియు పంపిణీపై ఒత్తిడి పెరుగుతోంది.
ఒకప్పుడు ప్రతి ఇంట్లో కిరోసిన్ స్టవ్ ఉండేది. లాంతర్లు, బుడ్డి దీపాలతో కిరోసిన్ మన సంస్కృతిలో భాగమైపోయింది. కానీ 2014 తర్వాత విద్యుదీకరణ పెరగడం, ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు రావడంతో కిరోసిన్ వాడకం ఏటా 26 శాతం తగ్గుతూ వచ్చింది. 2014లోనే ఢిల్లీని కిరోసిన్ రహిత నగరంగా ప్రకటించారు. 2019లో రేషన్ షాపుల్లో సబ్సిడీ ఆగిపోవడంతో ఇది పూర్తిగా కనుమరుగైపోయింది. ఇప్పుడు మళ్ళీ అదే కిరోసిన్ ఆపద్బాంధవుడిలా మన వంటింట్లోకి ప్రవేశిస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
