Lalit Modi: దావూద్ ఇబ్రహీం నుంచి ప్రాణభయంతోనే భారత్‌ను వీడా: లలిత్ మోదీ

Lalit Modi: దావూద్ ఇబ్రహీం నుంచి ప్రాణభయంతోనే భారత్‌ను వీడా: లలిత్ మోదీ
X
న్యాయపరమైన ఇబ్బందులతో పారిపోలేదన్న ఐపీఎల్ వ్యవస్థాపకుడు

ఐపీఎల్ (ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌) వ్యవస్థాపకుడు లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా విడిచిపెట్టి వెళ్లిపోవడానికి గల కారణాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం నుంచి హత్య బెదిరింపులు రావడంతోనే దేశాన్ని విడిచిపెట్టాల్సి వచ్చిందని వెల్లడించారు. న్యాయపరమైన ఇబ్బందుల కారణంగా తాను దేశాన్ని వీడలేదని.. ప్రాణహానితోనే వీడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.

ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో దావూద్ మ్యాచ్‌లు ఫిక్స్ చేయాలనుకున్నాడని తెలిపారు. ఈ నేపథ్యంలో తనకు ప్రాణహాని కల్పించేందుకు దావూద్ ఎన్నో ప్రయత్నాలు చేశాడని వివరించారు. తనకు రక్షణ కల్పించలేమని పోలీసులే తనకు చెప్పారని తెలిపారు. కేవలం 12 గంటలు మాత్రమే రక్షణ కల్పించగలమని చెప్పుకొచ్చారని వివరించారు. ఆనాడు డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ హిమాన్షు రాయ్ విమానాశ్రయంలో చెప్పిన మాటలను గుర్తుచేశారు. అక్కడ నుంచి ముంబైలోని ఫోర్ సీజన్స్ హోటల్‌కు తీసుకెళ్లారన్నారు. అవినీతి లేకుండా నిబద్ధతతో కూడిన ఆటే తనకు ముఖ్యమని వివరించారు. ఇక భారత్‌కు ఎప్పుడైనా వచ్చే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. చట్టపరంగా తాను పారిపోయిన వ్యక్తిని కాదని, తనపై ఒక్క కేసు కూడా లేదన్నాడు. 2010లో లలిత్‌ మోడీ భారత్‌ను వీడారు. ప్రస్తుతం లండన్‌లో నివాసం ఉంటున్నారు. అంతేకాకుండా సుస్మితా సేన్‌తో ఆయన కొత్త జీవితాన్ని కూడా ప్రారంభించారు.

Tags

Next Story